మూడు రాజధానుల ఏర్పాటు పై సీఎం జగాన్ తీసుకొచ్చిన ప్రతిపాదనను ప్రజలందరూ ఆమోడిస్తున్నారని, కానీ ఈ ప్రతిపాదన చంద్రబాబుకు మింగుడు పడడంలేదంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అమరావతిలో తన బినామీలు అక్రమంగా కొన్న భూముల ధరలు పడిపోతాయని ప్రతిపక్షనేత చంద్రబాబు బాధపడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు తానా అంటే పవన్ కల్యాణ్ తందానా అంటూ కీలుబొమ్మగా వ్యవహరిస్తున్న వైనాన్ని విమర్శించారు. అప్పట్లో రాజధాని ప్రాంతంలో భూములను చంద్రబాబు బలవంతంగా లాక్కుంటున్నారంటూ పవన్ ఆందోళన చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఇప్పుడు చంద్రబాబుకు వంతపాడుతున్నారని అవంతి ద్వజమెత్తారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పలేకపోతే బతకలేరని 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అబద్దాలకు కొదవలేదని విమర్శించారు.
