తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన సీనియర్ నేత .. కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి “రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు తప్ప నో రైల్వేస్ ఇన్ తెలంగాణ ఏరియా. కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కే అలవాటుండేది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే అనేక కొత్త రైళ్లను ప్రారంభించారు’ అని మంగళవారం చర్లపల్లిలో శాటిలైట్ రైల్వేస్టేషన్ నిర్మాణపనుల అనంతరం వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. అయితే మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తెలంగాణకు రైల్వే వ్యవస్థ ఎప్పుడో వచ్చింది. రైల్వే వ్యవస్థలో తెలంగాణకు మహోత్తర చరిత్ర ఉంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వేప్రస్థానాన్ని పరిశీలిస్తే.. దాదాపు 130 ఏండ్ల కిందటే ఇక్కడ రైల్వేవ్యవస్థకు బీజంపడింది. 1870లో నిజాం స్టేట్ రైల్వేవ్యవస్థ తెలంగాణ ప్రజల సొంతడబ్బుతో ఏర్పాటయింది.
1907లో నాంపల్లి రైల్వేస్టేషన్, 1916లో కాచిగూడ రైల్వేస్టేషన్ నిర్మించారు. ఆ సమయంలో దేశంలోని అనేక రాష్ర్టాల పరిధిలో అసలు రైలు అంటేనే తెలియని పరిస్థితి. 1966లో నిజాం స్టేట్ రైల్వే దక్షిణ మధ్యరైల్వేగా మారింది. కిషన్‌రెడ్డికి ఈ మాత్రం అవగాహన లేకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కిషన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం అంతా హైదరాబాద్‌తోనే ముడిపడి ఉన్నది. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన అంబర్‌పేట పరిధిలోనే కాచిగూడ రైల్వేస్టేషన్ ఉండగా, బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి దగ్గర్లోనే నాంపల్లి రైల్వేస్టేషన్ ఉన్నది అని తెలంగాణ వాదులు విరుచుకుపడుతున్నారు.
వీటికి శతాబ్దాల చరిత్ర ఉంటే, మోదీ ప్రధాని అయ్యాకే కొత్తగా రైళ్లు తిరుగుతున్నాయని వ్యాఖ్యానించడం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ‘హోదా ఆభరణంలా ఉండాలి.. ప్రజాసేవలో ఉన్న రాజకీయనాయకులైతే హుందాగా వ్యవహరించాలి. ఏకంగా కేంద్రమంత్రి హోదాలో ఉన్న కిషన్‌రెడ్డి.. ప్రధానికి భజనచేసే క్రమంలో స్థాయిని, అవగాహనను అటకెక్కించి.. పుట్టినగడ్డను, తలెత్తుకొనేలా సహకరించిన ప్రజలను కించపరిచారు. తెలంగాణ చరిత్రపై అవగాహన లేకపోవడంతోపాటు మోదీ భజన కోసం లేనిగొప్పల్ని చెప్పేప్రయత్నంలో నీచానికి దిగజారారు’ అని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తోటి బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పటికీ, కిషన్‌రెడ్డి రాజీనామా చేయకుండా తప్పించుకొన్నారని గుర్తుచేస్తున్నారు. తెలంగాణపై కిషన్‌రెడ్డికి ఎంతప్రేమ ఉన్నదో.. ఉద్యమ సమయం నుంచి నేటి ఎర్రబస్సు మాటలవరకు అర్థమవుతూనే ఉన్నదని ఎద్దేవాచేస్తున్నారు.