Home / SLIDER / ఏప్రిల్ 7తర్వాత కరోనా సమస్య ఉండదు

ఏప్రిల్ 7తర్వాత కరోనా సమస్య ఉండదు

ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాపాజిటివ్‌ కేసుల సంఖ్య 70కి చేరిందని, మరో 11 మంది కూడా చికిత్స తీసుకుని కోలుకున్నారని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.  కరోనాపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.

మన దగ్గర చికిత్స తీసుకుని కోలుకున్న వ్యక్తితో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. గాంధీ వైద్యులు అందించిన ధైర్యంతోనే కోలుకున్నానని కోలుకున్న వ్యక్తి చెప్పాడు. మిగిలిన 58 మందిలో కూడా పరీక్షలు నిర్వహించి తగ్గినవారిని క్రమంగా పంపిస్తాం. కరోనా వచ్చిన 76 ఏళ్ల వ్యక్తికి ఇతర జబ్బులు కూడా ఉన్నాయి. ఆయన ఒక్కడు తప్పించి మిగతా వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు.  పంపించే ముందు పక్కాగా పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకుంటాం. క్వారంటైన్‌లో ఉన్న 27వేల 937 మందిపై నిఘా ఉంది. 11 మంది కోలుకున్నారు..వారిని సోమవారం డిశ్చార్జ్‌ చేస్తారు.

లాక్‌డౌన్‌పై భారత్‌ను ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. సీరియస్‌గా ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాం. వైద్యులు, పోలీసులకు అందరూ సహకరించాలి. దక్షిణ కొరియాలో ఒకే వ్యక్తి ద్వారా 50వేల మందికి వచ్చింది. కొత్త కేసులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. కొత్త కేసులు చేరకుంటే ఏప్రిల్‌ 7లోగా కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. వ్యాధికి మందులేదు సెల్ఫ్‌ కంట్రోల్‌ మాత్రమే మన ఆయుధం. మార్చి 30 నుంచి క్వారంటైన్‌ గడువు పూర్తి చేసుకుని ఆరోగ్యంగా ఉన్నవారినందరినీ డిశ్చార్జ్‌ చేస్తామని సీఎం పేర్కొన్నారు.