Breaking News
Home / SLIDER / లాక్‌డౌన్‌ ఉండాల్సిందే!

లాక్‌డౌన్‌ ఉండాల్సిందే!

రాష్ర్టానికి, దేశానికి కరోనా నుంచి పూర్తిగా విముక్తి లభించాలంటే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మరికొంతకాలం కొనసాగాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న, వైద్య సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో లేని మనలాంటి దేశానికి లాక్‌డౌన్‌ తప్ప గత్యంతరం లేదని స్పష్టంచేశారు. అమెరికా, స్పెయిన్‌, ఇటలీ వంటి దేశాల పరిస్థితి మనకు రాకూడదని ఆకాంక్షించారు. లాక్‌డౌన్‌ను సడలిస్తే.. పరిస్థితి చేజారిపోతుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోగలం కానీ ప్రజల ప్రాణాలను వాపసు తీసుకురాలేమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

లాక్‌డౌన్‌లో ప్రజలు గొప్పగా సహకరించారన్న సీఎం.. ఇంకా సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకోసం రేయింబవళ్లు పనిచేస్తున్న వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను ముఖ్యమంత్రి కొనియాడారు. వైద్యసిబ్బందికి 10శాతం స్థూలవేతనాన్ని సీఎం గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యుఎస్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రూ.7,500, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు రూ.5వేలు సీఎం గిఫ్ట్‌గా ఇస్తామన్నారు. జిల్లాల్లో అహోరాత్రాలు కష్టించి పనిచేస్తున్న వారిని గుర్తించి కలెక్టర్ల ద్వారా ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో నిజాముద్దీన్‌ కేసులు రాకుండా ఉండిఉంటే పరిస్థితి ఆరామ్‌గా ఉండేదని చెప్పారు. మొదటి దశలో కరోనా సోకినవారు, క్వారంటైన్‌కు వెళ్లినవారు 9వ తేదీలోగా ఇండ్లకు వెళ్లిపోతారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా.. ప్రజల ప్రాణాల రక్షణకే ప్రాధాన్యమని స్పష్టంచేశారు. ఈ ఆపత్కాలంలో తోటివారికి సహకరిస్తున్నవారికి చేతులెత్తి దండంపెడుతున్నానని పేర్కొన్నారు. ఈ సంక్షోభసమయంలో ప్రజలను చైతన్యపరుచకుండా చిల్లర వార్తలు రాసినా, ప్రచారంచేసినా సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం ప్రగతిభవన్‌లో మీడియాతో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

లాక్‌డౌన్‌ తప్ప గత్యంతరంలేదు
కరోనా నుంచి బయటపడటానికి ప్రస్తుతం లాక్‌డౌన్‌ మినహా మరో గత్యంతరం లేదు. ఎవరో బయటకు రానిస్తలేరనే భావన కరెక్ట్‌ కాదు. ఎందుకంటే మనకు గత్యంతరం లేదు. కరోనా విచిత్రమైనది. దానికి మందు లేదు. మొదటి 50 పాజిటివ్‌ కేసులలో ఒక్కరు కూడా చనిపోలేదు. తబ్లిగీకి పోయివచ్చినోళ్లలో పదిమంది ఇండొనేషియావారు మంచిగనే ఉన్నరు. ఈ జబ్బు చాలా తీవ్రంగా ఉన్నది. ఓ రోజు నేనూ, మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుకుంటుంటే.. ఇద్దరు పాజిటివ్‌ కేసులవాళ్లకు సీరియస్‌గా ఉన్నదంటూ గాంధీ నుంచి ఫోన్‌ వచ్చింది. తర్వాత 45 నిమిషాల్లో ఒకరు చనిపోయారని చెప్పారు. మళ్లా 20 నిమిషాల్లో మళ్లొకరు చనిపోయారు. ఇంకొకాయన బాత్రూంకు పోయి అక్కడ్నే చనిపోయిండు. పాజిటివ్‌ వచ్చినవాళ్లలో తక్కువ లోడ్‌ అయినోళ్లు బతుకుతున్నరు.