ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. వీరు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం వైసీపీలో చేరలేదు.
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాల గిరి, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లు టీడీపీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వీరు తటస్థంగా ఉన్నట్టే!
ఎందుకంటే.. వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన తర్వాతనే తమ పార్టీలో చేరాల్సి ఉంటుందని జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన శాసనసభ మొదటి సమావేశంలోనే ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. వీరితోపాటే శాసనమండలిలో పోతుల సునీత, శివనాథరెడ్డి కూడా వైసీపీకి జై కొట్టారు.
మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ స్థానానికి మళ్లీ ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లు తెలుగుదేశం పార్టీని వీడతారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.