Home / SLIDER / రో”హిట్” మ్యాన్ షో

రో”హిట్” మ్యాన్ షో

ముంబాయి ఇండియన్స్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (54 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 80) అర్ధ శతకంతో విరుచుకుపడడంతో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ బోణీ చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ముంబై 49 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195/5 స్కోరు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (28 బంతుల్లో 47) రాణించాడు. యువ పేసర్‌ శివమ్‌ మావి (2/32) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో కోల్‌కతా ఓవర్లన్నీ ఆడి 9 ఓవర్లలో 146 పరుగులే చేసింది. కమిన్స్‌ (12 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 33) టాప్‌ స్కోరర్‌. ప్యాటిన్సన్‌ (2/25), బౌల్ట్‌ (2/30), బుమ్రా (2/32) తలో రెండు వికెట్లు పడగొట్టారు. రోహిత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

కోల్‌కతా తడ‘బ్యాటు’

లక్ష్య ఛేదనలో కోల్‌కతా తీవ్రంగా తడబడింది. 25/2తో ఓపెనర్లు శుభమన్‌ గిల్‌ (7), సునీల్‌ నరైన్‌ (9)ను కోల్పోయిన కోల్‌కతాను కెప్టెన్‌ దినేష్‌ కార్తీక్‌ (30), నితీష్‌ రాణా (24) ఆదుకొనే ప్రయత్నం చేశారు. సిక్స్‌తో ఖాతా తెరిచిన రాణా.. ఆ తర్వాత రివర్స్‌ స్వీప్‌లతో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. మరోవైపు కార్తీక్‌ కూడా వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండ్రీకి తరలించడంతో 8వ ఓవర్‌లో స్కోరు 50 పరుగులు దాటింది. అయితే, కార్తీక్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొన్న స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ (2/26).. జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు. కార్తీక్‌-రాణా మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. పొలార్డ్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ అద్భుతమైన క్యాచ్‌తో రాణా కూడా పెవిలియన్‌ చేరడంతో 77/4తో కోల్‌కతా కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే, మోర్గాన్‌, హార్డ్‌ హిట్టర్‌ రస్సెల్‌ క్రీజులో ఉండడంతో ఏదైనా అద్భుతం చేస్తారా? అని ఆశించారు. కానీ, 16వ ఓవర్‌లో డేంజర్‌మన్‌ రస్సెల్‌ (11), మోర్గాన్‌ (16)ను అవుట్‌ చేసిన బుమ్రా.. నైట్‌రైడర్స్‌ ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. రస్సెల్‌ను బౌల్డ్‌ చేసిన బుమ్రా.. మోర్గాన్‌ను క్యాచ్‌ అవుట్‌ చేశాడు. నాయక్‌ (1)ను బౌల్ట్‌ పెవిలియన్‌ చేర్చాడు. కమిన్స్‌ ఆఖర్లో మెరుపులు మెరిపించినా.. అది ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.

ఆరంభం నుంచే ధాటిగా..

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ముందుండి నడిపించడంతో ముంబై గట్టిపోటీ ఇచ్చే స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (1) వికెట్‌ కోల్పోయింది. శివమ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే క్రమంలో డికాక్‌ క్యాచ్‌ అవుటయ్యాడు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌తో కలసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. మూడో ఓవర్‌లో సందీప్‌ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండ్రీకి తరలించిన యాదవ్‌.. అదే ఓవర్‌లో మరో మూడు ఫోర్లు బాదాడు. తర్వాతి ఓవర్‌లో మావి కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో షాట్లు ఆడే అవకాశం రాలేదు. కానీ, ఐదో ఓవర్‌లో పేసర్‌ ప్యాట్స్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో రోహిత్‌ రెండు సిక్సర్లతో గేర్‌ మార్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లో యాదవ్‌ ఫోర్‌ బాదడంతో టీమ్‌ స్కోరు 50 పరుగులు దాటింది. వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి కోల్‌కతా కెప్టెన్‌ దినేష్‌ కార్తీక్‌ అందుబాటులో ఉన్న బౌలర్లందరినీ ప్రయోగించినా ఫలితం లేకపోయింది. దీంతో 10 ఓవర్లలో ముంబై 94/1తో నిలిచింది. కానీ, తర్వాతి ఓవర్‌లో అర్ధ శతకానికి చేరువవుతున్న సూర్యకుమార్‌ను రనౌట్‌ చేసిన కోల్‌కతా.. రెండో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యానికి తెరదించింది. కానీ, సౌరభ్‌ తివారీ (21) అండతో రోహిత్‌ స్కోరు బోర్డును నడిపించాడు. 12వ ఓవర్‌లో కుల్దీప్‌ బౌలింగ్‌లో డబుల్‌తో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. టీమ్‌ స్కోరు కూడా 100 పరుగుల మైలురాయి దాటింది. అయితే, తివారీని క్యాచ్‌ అవుట్‌ చేసిన నరైన్‌.. మూడో వికెట్‌కు 49 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (18) కూడా ధాటిగా ఆడాడు. సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్‌ను శివమ్‌ క్యాచ్‌ అవుట్‌ చేశాడు. లోఫుల్‌టాస్‌ బంతిని ఆడే క్రమంలో కమిన్స్‌కు రోహిత్‌ క్యాచిచ్చాడు. పాండ్యాకు పొలార్డ్‌ (13 నాటౌట్‌) జత కలవడంతో మెరుపులు మెరిపిస్తారని భావించారు. కానీ, 18వ ఓవర్‌లో రస్సెల్‌ బౌలింగ్‌లో పాండ్యా హిట్‌ వికెట్‌గా వెనుదిరగ్గా.. ఆ ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే లభించాయి. ఇక చివరి ఓవర్‌లో జాగ్రత్తగా బౌలింగ్‌ చేసిన శివమ్‌.. పొలార్డ్‌, క్రునాల్‌ పాండ్యా (1 నాటౌట్‌) భారీ షాట్లు ఆడకుండా అడ్డుకున్నాడు.

200 ఐపీఎల్‌లో ఇప్పటిదాకా రోహిత్‌ కొట్టిన సిక్సర్లు. దీంతో క్రిస్‌ గేల్‌ (326), డివిల్లీర్స్‌ (214), ధోనీ (212) తర్వాత 200 సిక్సర్ల క్లబ్‌లో చేరిన నాలుగో ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు.

స్కోరుబోర్డు

ముంబై ఇండియన్స్‌: క్వింటన్‌ డికాక్‌ (సి) నిఖిల్‌ నాయక్‌ (బి) శివమ్‌ మావి 1, రోహిత్‌ శర్మ (సి) కమిన్స్‌ (బి) శివమ్‌ మావి 80, సూర్యకుమార్‌ యాదవ్‌ (రనౌట్‌) 47, సౌరభ్‌ తివారీ (సి) కమిన్స్‌ (బి) నరైన్‌ 21, హార్దిక్‌ పాండ్యా (హిట్‌ వికెట్‌) (బి) రస్సెల్‌ 18, పొలార్డ్‌ (నాటౌట్‌) 13, క్రునాల్‌ పాండ్యా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 195/5; వికెట్ల పతనం: 1-8, 2-98, 3-147, 4-177, 5-180; బౌలింగ్‌: సందీప్‌ వారియర్‌ 3-0-34-0, శివమ్‌ మావి 4-1-32-2, ప్యాట్‌ కమిన్స్‌ 3-0-49-0, సునీల్‌ నరైన్‌ 4-0-22-1, ఆండ్రీ రస్సెల్‌ 2-0-17-1, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-39-0.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌గిల్‌ (సి) పొలార్డ్‌ (బి) బౌల్ట్‌ 7, నరైన్‌ (సి) డికాక్‌ (బి) ప్యాటిన్సన్‌ 9, దినేష్‌ కార్తీక్‌ (ఎల్బీ) చాహర్‌ 30, నితీష్‌ రాణా (సి) హార్దిక్‌ పాండ్యా (బి) పొలార్డ్‌ 24, మోర్గాన్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 16, రస్సెల్‌ (బి) బుమ్రా 11, నిఖిల్‌ నాయక్‌ (సి) హార్దిక్‌ పాండ్యా (బి) బౌల్ట్‌ 1, ప్యాట్‌ కమిన్స్‌ (సి) హార్దిక్‌ పాండ్యా (బి) ప్యాటిన్సన్‌ 33, శివమ్‌ మావి (స్టంప్డ్‌) డికాక్‌ (బి) చాహర్‌ 9, కుల్దీప్‌ యాదవ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 146/9; వికెట్ల పతనం: 1-14, 2-25, 3-71, 4-77, 5-100, 6-101, 7-103, 8-141, 9-146; బౌలింగ్‌: ట్రెంట్‌ బౌల్ట్‌ 4-1-30-2, జేమ్స్‌ ప్యాటిన్సన్‌ 4-0-25-2, బుమ్రా 4-0-32-2, రాహుల్‌ చాహర్‌ 4-0-26-2, పొలార్డ్‌ 3-0-21-1, క్రునాల్‌ పాండ్యా 1-0-10-0

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat