Home / INTERNATIONAL / డెక్సామీథ‌సోన్ తీసుకున్న ట్రంప్‌.. ఆ డ్ర‌గ్ ఎందుకిచ్చారు ?

డెక్సామీథ‌సోన్ తీసుకున్న ట్రంప్‌.. ఆ డ్ర‌గ్ ఎందుకిచ్చారు ?

డెక్సామీథ‌సోన్ ఓ స్టెరాయిడ్ డ్ర‌గ్‌.  దీన్ని ట్యాబ్లెట్ లేదా ఇంజెక్ష‌న్ రూపంలో తీసుకుంటారు.  అయితే కోవిడ్ చికిత్స పొందుతున్న డోనాల్డ్ ట్రంప్‌కు ఈ డ్ర‌గ్‌ను ఇచ్చిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు.   డెక్సామీథ‌సోన్ డ్ర‌గ్ ను ఎందుకు వినియోగిస్తారో ప‌రిశీలిద్ధాం.  అస్వ‌స్థ‌త తీవ్రంగా ఉన్న వారికి మాత్రమే ఈ మందును వాడుతారు.  అంటే ట్రంప్ ఆరోగ్యం బ‌లహీనంగా ఉన్న‌ట్లు అర్థం అవుతున్న‌ది.  డెక్సామీథ‌సోన్ తీసుకోవ‌డం వ‌ల్ల ఇమ్యూన్ వ్య‌వస్థ కుదుట‌ప‌డుతుంది.  రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను స్థిరీక‌రించ‌డం వ‌ల్ల ఈ డ్ర‌గ్‌తో ప్రాణాలు కాపాడే అవ‌కాశం ఉన్న‌ది.  అయితే వ్యాధి తీవ్రంగా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఈ మందును తీసుకోవాలి.  ఒక‌వేళ ముంద‌స్తుగానే ఈ డ్ర‌గ్‌ను తీసుకుంటే, అప్పుడు శ‌రీర సామ‌ర్థ్యం త‌గ్గే ప్ర‌మాదం కూడా ఉన్న‌ది.  డ్ర‌గ్‌ను ముందే ఇస్తే, వైర‌స్‌తో పోరాడే శ‌క్తిని శ‌రీరం కోల్పోతుంది.

వ్యాధి ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్న స‌మ‌యంలో ఈ డ్ర‌గ్‌ను వాడ‌రాదు.  అయితే ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఉన్న పేషెంట్ల‌కు మాత్ర‌మే డెక్సామీథ‌సోన్ ఇస్తే బెట‌ర్‌.  బ్రిట‌న్‌లో జ‌రిగిన ట్ర‌య‌ల్స్‌లో ఇదే రుజువైంది. అత్యంత క్లిష్టంగా ఉన్న కోవిడ్ రోగుల‌కు మాత్ర‌మే ఈ మందు ఇవ్వాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా గ‌తంలో స్ప‌ష్టం చేసింది. హాస్పిటల్‌లో ఉన్న ట్రంప్‌కు ర‌క్తంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ 94 శాతం కన్నా త‌క్కువ న‌మోదు అయ్యాయి. ఆ స‌మ‌యంలో ఈ డ్ర‌గ్ అవ‌స‌ర‌మే. యాండీబాడీ థెర‌పీలో భాగంగా ట్రంప్‌కు రెమిడిసివిర్ ఇంక్ష‌న్ కూడా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

డెక్సామీథ‌సోన్ చాలా త‌క్కువ ధ‌ర‌కే అంత‌టా దొరుకుతుంది. కీళ్ల నొప్పులు, అల‌ర్జీ, అస్త‌మా, క్యాన్స‌ర్ లాంటి వ్యాధుల‌కు సాధార‌ణంగా డెక్సామిథ‌సోన్ వాడుతుంటారు. శ్వాస కోస వ్యాధుల కోసం డెక్సామీథ‌సోన్‌ను వాడేది త‌క్కువే. సార్స్‌, మెర్స్ వ్యాధుల చికిత్స కోసం గ‌తంలో స్వ‌ల్పంగా ఈ డ్ర‌గ్‌ను వినియోగించారు.