Home / EDITORIAL / రాష్ర్టాలకు వచ్చేది కొల్లగొట్టాలే ఇచ్చేది ఎత్తగొట్టాలే-మంత్రి హారీష్ రావు విశ్లేషణ

రాష్ర్టాలకు వచ్చేది కొల్లగొట్టాలే ఇచ్చేది ఎత్తగొట్టాలే-మంత్రి హారీష్ రావు విశ్లేషణ

  • నేడు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా..

రాజకీయంగా  కూలగొట్టడం- ఆర్థికంగా కొల్లగొట్టడం బీజేపీ పాలకుల విధానంగా మారింది. కొల్లగొట్టే ప్రక్రియకు జీఎస్టీ విధానాన్ని ఓ అస్త్రంగా మార్చుకున్నది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని నిర్లజ్జగా కాలరాస్తోంది. మెడ మీద కత్తి పెట్టి తమ విధానాలను అనుసరించే విధంగా రాష్ర్టాలను నిస్సాయస్థితిలోకి నెడుతోంది.  నేటి జీఎస్టీ సమావేశం ఇలాంటిదే. జీఎస్టీ పూర్వాపరాల్లోకి వెళితే.. జీఎస్టీ విధానం బీజేపీ అల్లిన ఓ సాలెగూడుగా మార్చింది. అందులోకి వెళితే చిక్కి బలయిపోవడం తప్ప బయటకు రాలేరు. నేడు రాష్ర్టాల పరిస్థితి అదే చందంగా ఉన్నది. 

వస్తుసేవల పన్నులో రాష్ర్టాలకు చెల్లించాల్సిన వాటా విషయంలో  కేంద్ర వైఖరి ఉద్దేశపూర్వకంగా సంక్షిష్టతను సృష్టించింది. ఇది కేంద్రం భావించినట్టుగానే రాష్ర్టాలకు నష్టదాయకంగా మారింది. దేశవ్యాప్తంగా పన్నుల విధానాన్ని సమన్వయం చేసేందుకు ఒకే రకమైన పన్ను విధానం తీసుకువస్తామంటే రాష్ర్టాలకు అనుమానాలున్నప్పటికీ కేంద్రాన్ని విశ్వసించి సహకరించాయి. కేంద్రం జీఎస్టీ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడానికి తమ ఆర్థిక స్వయంప్రతిపత్తిని త్యాగం చేయడానికి సైతం రాష్ర్టాలు వెనుకాడలేదు. తమ ఆదాయాన్ని కొంత నష్టపోవాల్సి వస్తుందని తెలిసినా తెలంగాణ వంటి రాష్ర్టాలు కేంద్ర నూతన పన్ను విధానానికి మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో 50% మేరకు ఆదాయాన్ని సమకూర్చే పన్నులు జీఎస్టీలో కలిసిపోయాయి. కొత్తగా అనేక ఆశలతో ఎదుగుతున్న రాష్ర్టానికి ఇది శరాఘాతం లాంటిదే. ఇక కేంద్ర రాబడులలో 31 శాతం ఆదాయాన్ని సమకూర్చే పన్నులు మాత్రమే జీఎస్టీలో కలిసాయి.  జీఎస్టీ విధానంలో కేంద్రం అనుసరించిన ఎత్తుగడ  ఏంటో ఇక్కడే అర్థం అవుతోంది. వచ్చేది కొల్లగొట్టే విధానంలో ఇది మొదటి మెట్టు.  ఇది గమనించే రాష్ర్టాలు ఆందోళన వ్యక్తం చేయడంతో నమ్మించేందుకు కేంద్రం  జీఎస్టీ (రాష్ర్టాలకు పరిహారం) చట్టం, 2017ను ముందుకు తెచ్చింది. జీఎస్టీ అమలు కారణంగా రాష్ర్టాలకు వచ్చే ఆదాయంలో ఏర్పడే నష్టాన్ని పూరించడమే జీఎస్టీ పరిహార చట్టం ఉద్దేశ్యం. ఈ పరిహారం మొదట అయిదేండ్ల కాలానికి చెల్లించాలని నిర్దేశించినా, జీఎస్టీ కౌన్సిల్‌ సిఫారసుపై ఈ పరిహారం చెల్లించే కాలాన్ని మరింత కాలం  పొడిగించే వెసులుబాటు జీఎస్టీ చట్టంలో ఉన్నది.

2017 జనవరి 3, 4 తేదీల్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ ఎనిమిదవ సమావేశంలో రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపు విధానంపై కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చింది. జీఎస్టీ పరిహార నిధి నుంచి రాష్ర్టాలకు ద్వైమాస ప్రాతిపదికన పరిహారం చెల్లిస్తారు. రాష్ర్టాలకు చెల్లించాల్సిన పరిహారం కంటే జీఎస్టీ పరిహార నిధిలో నిలువలు తగ్గితే రుణాలు తీసుకోవడంతోపాటు అదనపు నిధుల సేకరణ చేస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి హమీ ఇచ్చారు. పరిహారం పొందాల్సింది రాష్ర్టాలు కాబట్టి, కేంద్రమే రుణాలు తీసుకుంటుందనే అంతా భావించారు. పరిహార నిధిలో కొరత ఏర్పడితే సమస్యను ఎలా పరిష్కరిస్తారంటూ అప్పటి తెలంగాణ ఆర్థికమంత్రి అభ్యంతరం లేవనెత్తడంతో, ఇందుకు ప్రతిస్పందనగా ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్‌ పదవ సమావేశంలో కౌన్సిల్‌ కార్యదర్శి కూడా వివరణ ఇచ్చారు. ఇవన్నీ ఆ సమావేశ మినట్స్‌ లో కూడా నమోదయ్యాయి.

జీఎస్టీ పరిహార సెస్సు వసూళ్లు పరిహారం కన్నా ఎక్కువగా ఉండటం వలన, జీఎస్టీ అమలు చేసిన మొదటి రెండేండ్లలో రాష్ర్టాలకు పరిహారం చెల్లించడంలో ఎటువంటి సమస్య రాలేదు. దీంతో 2018-19 చివరినాటికి జీఎస్టీ పరిహారనిధిలో రూ .47,272 కోట్ల మిగులు కూడా ఉన్నది. దానిని భారత కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమచేసి, కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంది. ఇది నిర్దేశిత చట్టానికి విరుద్ధం. జీఎస్టీ పరిహార సెస్‌ నిధి నిలువలను  పబ్లిక్‌ ఫండ్‌లో జమచేయాలని చట్టం నిర్దేశిస్తుంది.

ఇది రాష్ర్టాలకు రావాల్సిన సొమ్మును కొల్లగొట్టడంలో  రెండోమెట్టు. ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన  నివేదికలో  ఈ  కొల్లగొట్టే విధానాన్ని కాగ్‌ కూడా  కంఠమెత్తి ఖండించింది. రాష్ర్టాల హక్కులకు గొడ్డలిపెట్టని తీవ్రంగా ఆక్షేపించింది. సెస్‌ వసూళ్ల మిగులును  మళ్లించడం ద్వారా, ఆ సంవత్సరం కేంద్ర రెవెన్యూ వసూళ్లు అధికంగాను, ద్రవ్యలోటు తక్కువగాను అంచనా వేయడానికి దారితీసిందని కాగ్‌ (+) స్పష్టం చేసింది. పబ్లిక్‌ ఖాతా నుంచి బదిలీ చేయడానికి బదులుగా, జీఎస్టీ పరిహారం గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌గా బదిలీ చేయబడింది. ఇది కనిపెట్టిన కాగ్‌ జీఎస్టీ పరిహార సెస్‌ అనేది గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ కాదు. అది రాష్ర్టాల హక్కు. పైగా ఈ పొరపాటు వలన గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ లెక్కలలో చిక్కులు ఏర్పడే సమస్య ఉన్నది అని  పేర్కొన్నది.  నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా కాగ్‌ అభిశంసనలను తోసి రాజంటన్నట్లుగా కేంద్ర వైఖరి ఉంది.  అసలు కేంద్రం దేశంలో ఏ రాజ్యంగ వ్యవస్థను గౌరవించలేదు. దానికి కాగ్‌ ఏమీ అతీతం కాదు.

దేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడానికి, సహకార సమాఖ్య విధానాన్ని ప్రోత్సహిస్తామని, రాష్ర్టాలను సమాన భాగస్వాములుగా చేర్చుకుంటామని కేంద్రం పదేపదే చెప్పింది. ఆచరణలోకి వచ్చేసరికి  గోముఖ వ్యాఘ్రంలా వ్యవహరిస్తోంది.  వట్టి మాటలు చెప్పే బదులు రాష్ర్టాల ఆర్ధిక ప్రతిపత్తికి భరోసాగా తగు చర్యలు చేపట్టడం కేంద్రం విధి. కేంద్రం రాష్ర్టాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పుకోవడం ఇదే మొదటి సారి కాదు.  ఉదాహరణకు, కేంద్ర అమ్మకపు పన్ను రేట్లను 2007-08లో  ఆనాటి  కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 4 నుంచి 3 శాతానికి, 2008-09లో (యూపీఏ ప్రభుత్వం) 2 శాతానికి  తగ్గించినపుడు.. రాష్ర్టాలకు పూర్తి పరిహారాన్ని ఇస్తామని హామీఇచ్చింది. ఆ మాటను నిలుపుకోలేదు. రాష్ర్టానికి రావాల్సిన రూ.3,647 కోట్లను ఎగ్గొట్టింది. రాష్ర్టాలకు ఇచ్చే నిధులను ఎగ్గొట్టడంలో యూపీఏ, ఎన్డీఏ దొందూదొందే. 

జీఎస్టీ సెస్‌ పరిహార నిధిలో 2019-20 సంవత్సరంలో రూ.69,751 కోట్ల లోటు ఏర్పడింది. కాబట్టి, రాష్ర్టాలకు పరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం జరిగింది. జీఎస్టీ పరిహార నిధిలోని నిలువలను నియమ విరుద్ధంగా భారత కన్సాలిడేటెడ్‌ నిధికి మళ్లించిన నిధులు మరియు 2017-18 నాటికి ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌నందు మిగిలి ఉన్న నిధులను వినియోగించి జీఎస్టీ పరిహార నిధిలో లోటును పూడ్చారు. గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వల్ల ఆర్థిక వృద్ధి మందగించడం ఓవైపు  కుంగదీస్తుంటే, పులిమీద పుట్రలా కరోనా మహమ్మారి, కేంద్రం, రాష్ర్టాల ఆదాయాలపై తీవ్ర ప్రతికూలం ప్రభావం చూపింది. అయినా, కరోనా మహమ్మారిపై కేంద్రం నుంచి ఆశించిన రీతిలో సహకారం రాకున్నా రాష్ర్టాలు  తమశక్తినంతా ఉపయోగించి పోరాడాల్సి వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయి ఆరు నెలలు గడిచినా కేంద్రం నుంచి ఎలాంటి పరిహారం అందకపోవడంతో రాష్ర్టాల ఆర్ధిక పరిస్థితి రోజుకు రోజుకూ దిగజారిపోతున్నది. రాష్ర్టాలకు పరిహారం ఇచ్చే సమస్యపై చర్చించడానికి ప్రత్యేకంగా పిలిచిన జీఎస్టీ కౌన్సిల్‌ 41వ సమావేశం ముగిసే సమయానికి, కేంద్రం రాష్ర్టాలకు రెండు మార్గాలను సూచించింది. మెడ మీద కత్తి పెట్టి చర్చించడం అనే వ్యూహానికి ఈ ప్రత్యామ్నాయాలు మచ్చుతునక.   చట్టబద్ధంగా ఇవ్వాల్సింది ఇవ్వకుండా అప్పు తెచ్చుకోవాలి. ఆ అప్పయినా స్వేచ్చగా తీసుకునే అవకాశం రాష్ర్టాలకు ఇవ్వకుండా సవా లక్ష నిబంధనలు. చావనివ్వదు బతనివ్వదు అన్నట్టుగా ఉంది కేంద్రం వ్యవహార శైలి. అటు చూస్తే గొయ్యి ఇటు చూస్తే నుయ్యి అన్నది రాష్ర్టాల పరిస్థితి. అప్పులు తీసుకోవడంలో కేంద్రం పెట్టిన నిబంధనల సంగతి పరిశీలిద్దాం. అందులో మొదటిది, జీఎస్టీ అమలు కారణంగా రాష్ర్టాల ఆదాయం ఈ సంవత్సరం రూ.97,000 కోట్లు తగ్గుతుందని కేంద్రం అంచనా వేసింది. ఈ లోటును భర్తీ చేయడానికి కేంద్రము ప్రత్యేక విండో ద్వారా రుణం తీసుకోవడానికి రాష్ర్టాలకు అనుమతి ఇస్తుంది. ఈ రుణాన్ని వడ్డీతో సహా కేంద్రమే చెల్లిస్తుందని తెలిపింది. ఈ రుణాన్ని చెల్లించడానికి జీఎస్టీ పరిహార సెస్సు గడువును ఐదేండ్లకు మించి పొడిగిస్తుంది.

రెండవ మార్గం కింద,  జీఎస్టీ అమలు కారణంగా కలిగిన ఆదాయ నష్టం మరియు కొవిడ్‌ మహమ్మారి వల్ల కలిగిన నష్టాలతో రాష్ర్టాల ఆదాయం రూ.2.35 లక్షల కోట్ల తగ్గుతుందని కేంద్రం అంచనా వేసింది. ఈ మొత్తాన్ని రాష్ర్టాలు అప్పు తీసుకుంటే రాష్ర్టాలే తమ వడ్డీ భారాన్ని భరించాల్సి ఉంటుంది మరియు ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద కల్పించిన అదనపు రుణ సౌకర్యం వెసులుబాటులో కొంత భాగం  కోల్పోవాల్సి వస్తుంది. రాష్టాలకు తగ్గినా ఆదాయాన్ని ఈ రెండు రకాలుగా విభజించడం అనేది చట్టవిరుద్ధం. రాష్ర్టాలు కోల్పోయిన ఆదాయాన్ని పూర్తిగా సమకూర్చడం కేంద్రం బాధ్యత. ఈ బాధ్యతకు తిలోదకాలిచ్చి ఆప్షన్ల పేరుతో రాష్ర్టాల ఇచ్చే  ఆదాయాన్ని ఎత్తగొట్టే మాయపాయాన్ని మెత్తగా అమలుచేస్తున్నది.

ఒకవేళ ఏ రాష్ట్రమైనా ఈ రెండు మార్గాల్లో ఒక దానిని ఎంచుకోకపోతే ఆ రాష్ర్టానికి సెస్సులోటు 2022 తరువాత వాయిదాల పద్ధతిలో మాత్రమే భర్తీచేస్తామని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విధంగా రాష్ర్టాలపై ఒత్తిడి చేయడం కేంద్రానికి సబబు కాదు. రాష్ర్టాలకు ఇప్పుడు నిధులు అవసరం ఉండగా, ఇంకా రెండేండ్లు వేచిచూడమని చెప్పడం పూర్తిగా అసమంజసం. జీఎస్ట్టీ రాబడులు తగ్గిపోయాయని, కరోనా మహమ్మారి కారణంగా ఆర్ధిక పరిస్థితి చేయి జారీ పోయిందని చెపుతూ, కేంద్రం రాష్ర్టాలకు మొండి చేయి చూపుతున్నది. జీఎస్టీ పరిహార చట్టం స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తున్నది. జీఎస్టీ చట్ట ప్రకారం రాష్ర్టాలకు ప్రతిసంవత్సరం 14 శాతం వృద్ధి రేటు ఆధారంగా పరిహారం చెల్లించాల్సి ఉన్నది. కానీ దానికి విరుద్దంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆదాయ లోటును 10 శాతం వృద్ధిరేటు ఆధారంగా ఈ సంవత్సరం అంచనా వేసింది.  జీఎస్టీ అమలు కారణంగా రాష్ర్టాలకు వచ్చిన నష్టాలు పూడ్చేందుకు కేంద్రం అప్పు చేసి అయినా పరిహారం చెల్లించాలి. దాని బదులు రాష్ర్టాలనే అప్పు చేయమని కేంద్రం పురమాయించడం ఏ రకం నీతో  బీజేపీ పాలకులే చెప్పాలి.

కేంద్రానికి బదులుగా రాష్ర్టాలు ఎందుకు రుణం తీసుకోవాలి అనే అంశం పై  అసంబద్ధ వాదనలను లేవనెత్తుతున్నది.

1.కేంద్రం యొక్క రుణాలు స్థూల ఆర్థిక పరిణామాలను కలిగి ఉంటాయి.

2.పరిహార సెస్‌లో కొరతను కేంద్రమే తీర్చాలని జీఎస్టీ చట్టంలో లేదు. (భారత అటార్నీ జనరల్‌ యొక్క అభిప్రాయం).

3.రాష్ర్టాలకు తమ జీఎస్డీపీలో 5 శాతం వరకు అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండనే ఉన్నది, అయినా 2020 సెప్టెంబర్‌ 8 నాటికి రాష్ర్టాలు తమ జీఎస్డీపీలో 1.25 శాతం మాత్రమే రుణాలు తీసుకున్నాయి.

4.జీఎస్టీ పరిహార సెస్‌లో లోటును పూడ్చడానికి భారత కన్సాలిడేటెడ్‌ నిధి నుంచి చెల్లించడానికి అవకాశం లేదు, అనే వాదనను కేంద్రం వినిపిస్తున్నది.

కేంద్రం వాదనలు తిమ్మిని బమ్మి చేయడం తప్ప ఏ మాత్రం న్యాయసమ్మతం కాదు. ఎందుకంటే – రుణాలు కేంద్రం తీసుకున్నా, రాష్ర్టాలు తీసుకున్నా స్థూలంగా ఆర్ధికపరిణామాలు (సమస్యలు) ఒకే విధంగా ఉంటాయి. వాస్తవానికి ఆర్ధిక సంస్థల నుంచి కేంద్రం తక్కువ రేటుకు రుణం తీసుకోవచ్చు. కొరతను కేంద్రం తీర్చగలదని స్పష్టమైన నిబంధన లేనప్పటికీ, నిధుల కొరత తలెత్తినపుడు రాష్ర్టాలు రుణాలు తీసుకోవాలని కూడా స్పష్టమైన నిబంధన అందులో లేదు.  కాగ్‌ (+) పేర్కొన్నట్టు, పరిహారం రాష్ర్టాల హక్కు. పరిహారం పొందే వారినే అప్పు తెచ్చుకోపోండి అని అనడం సబబుగా లేదు. రుణాలను తెచ్చుకోవడంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో పద్ధతిని అవలంబిస్తున్నది. తెలంగాణ వంటి రాష్ర్టాలు ఇప్పటికే తమ జీఎస్డీపీలో 2.6 శాతం వరకు రుణాలు తీసుకున్నాయి. ఇప్పుడు ఉన్న అనిశ్చిత పరిస్థితిలో చాలా రాష్ర్టాలు రుణ పరిమితిలో తమకున్న వెసులుబాటును పూర్తిగా వినియోగించు కోవడం తప్ప వేరే మార్గంలేదు.

భారత కన్సాలిడేటెడ్‌ నిధి నుంచి పరిహారం చెల్లించలేమనే వాదన పూర్తిగా అసంబద్ధంగా ఉన్నది. జీఎస్టీ పరిహార నిధిలోని మిగులును చట్టవిరుద్ధంగా భారత కన్సాలిడేటెడ్‌ నిధిలో  జమచేశారు. 2019-20 సంవత్సరంలో భారత కన్సాలిడేటెడ్‌ నిధి నుంచి రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం చెల్లించారు. మిగులు ఉన్నప్పుడు, ఆ నిలువలను భారత కన్సాలిడేటెడ్‌ నిధిలో జమ చేసి కేంద్రం వినియోగించుకుంటుంది. కానీ, లోటు ఏర్పడినపుడు మాత్రం భారత కన్సాలిడేటెడ్‌ నిధి నుంచి పరిహారం చెల్లించలేమని రాష్ర్టాలకు చెప్పడం  ఇవ్వాల్సింది ఎత్తగొట్టడంలో రెండో మెట్టు.

జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు కేంద్రం సెస్సులను విధించదని, సెస్సుల జోలికి పోదని రాష్ర్టాలు  జీఎస్టీ కత్తికి మెడనప్పగించాయి. ఎందుకంటే, సెస్సుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్రం రాష్ర్టాలతో పంచుకోదు. తద్విరుద్ధంగా కేంద్రం దిగుమతులపై కొత్తగా సెస్సులను విధించడమేగాక, పెట్రోలియం ఉత్పత్తులపై సెస్‌ ను పెంచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గగా, సెస్సు పెంపుద్వారా కేంద్రం దాని నుంచి ప్రతి సంవత్సరం సుమారు రూ. 2 లక్షల కోట్లు లబ్ధి పొందుతున్నది. రెవెన్యూ రాబడులు లేక అల్లాడుతున్న రాష్ర్టాలు, అదనపు వనరుల కోసం వ్యాట్‌ పెంచాలనుకున్నా పెంచలేని పరిస్థితి.  కేంద్రం విధించిన సెస్సు వలన, రాష్ట్రంలో పన్నులు వేస్తే ధరలు పెరుగుతాయని, ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని రాష్ర్టా లు తమ ఆదాయాన్ని కోల్పోయి వెనక్కి తగ్గాయి.  ఇదిలా ఉంటే కరోనాతో అష్టకష్టాలు పడుతుంటే కొవిడ్‌ -19ను విపత్తుగా ప్రకటించి చేతులు దులుపుకుందే తప్ప  స్టేట్‌ డిసాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ మిటిగేషన్‌ ఫండ్స్‌ లో నిధులను ఏ మాత్రం పెంచలేదు. శుష్కప్రియాలు శూన్యహస్తాలు అన్నట్టుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించింది.

కొన్నేండ్లుగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో ఆర్థిక వృద్ధి మందగించడం ఓవైపు  కుంగదీస్తుంటే, పులి మీద పుట్రలా కరోనా మహమ్మారి, కేంద్రం, రాష్ర్టాల ఆదాయాలపై తీవ్ర ప్రతికూలం ప్రభావం చూపింది. అయినా, కరోనా మహమ్మారిపై కేంద్రం నుంచి ఆశించిన రీతిలో సహకారం రాకున్నా రాష్ర్టాలు  తమ శక్తి నంతాఉపయోగించి పోరాడాల్సి వచ్చింది. 

కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేటాయింపులను తగ్గించాలని పలు కమిటీలు, ఫైనాన్స్‌ కమిషన్లు సిఫారసు చేశాయి. అయినప్పటికీ ఈ పథకాలకు కేటాయింపులు రూ. 3.5 లక్షల కోట్లు. ఈ పథకాలన్నీ రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించినవే. ద్రవ్య బదిలీల పై కేంద్ర ఆర్థికసంఘం చేసే సిఫారసులను అవార్డుగా పరిగణిస్తారు. 2020-21లో సిఫారసు చేసిన పన్నుల పంపిణీ, గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నందున, పదిహేనవ ఆర్థిక సంఘం కర్ణాటక, మిజోరం, తెలంగాణ రాష్ర్టాలకు ప్రత్యేకంగా రూ.6,764 కోట్ల నిధిని సిఫారసు చేసింది. ఇలా ప్రత్యేక నిధిని ఇవ్వడం అనేది కొత్త ఒరవడి అవుతుందనే నెపంతో కేంద్రం ఈ సిఫారసును అంగీకరించలేదు. ఇచ్చేది ఎత్తగొట్టడం అనే వంచనా శిల్పంలో మరో కోణాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది.

ఈ క్లిష్టమైన సమయంలో, జీఎస్టీ పరిహారంలో రాష్ర్టాల సముచిత వాటాను నిరాకరించడం అనేది రాష్ర్టాల నమ్మకాన్ని దెబ్బతీయడమే. ఆర్థిక వ్యవస్థ మందగించడంతో కేంద్రం నుంచి రాష్ర్టాలకు వచ్చే  పన్నుల వాటా సుమారు రూ .3 లక్షల కోట్లు తగ్గే అవకాశం ఉంది.  జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత  రాష్ర్టాలకు వేరే ముఖ్యమైన ఆదాయ వనరులు లేవు.  కేంద్రానికి మాత్రం వివిధ రకాల ఆదాయ వనరులు ఉన్నాయి. ఆదాయపు పన్ను, కార్పొరేషన్‌ పన్ను, కస్టమ్స్‌ సుంకాలు వంటివి కేంద్రానికి ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. ఇవన్నీ జీఎస్టీ పరిధిలో రావు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుండి వచ్చే డివిడెండ్‌, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డివిడెండ్‌, స్పెక్ట్రం అమ్మకం ద్వారా వచ్చే రాబడులు వంటివి కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఇందులో రాష్ర్టాలకు ఎటువంటి లభ్యత లేదు.

ఇది చాలా క్లిష్టమైన సమయం. రాష్ర్టాలు సహాయం కోసం  ఆశగా కేంద్రంవైపు చూస్తున్నాయి. తమను తాము కాపాడుకోవాలని రాష్ర్టాలను విధికి వదిలివేయడానికి ఇది తగిన సమయం కాదు. కాబట్టి, జీఎస్టీ చట్టం నిబంధనలకు కట్టుబడి రాష్ర్టాలకు పరిహారాన్ని చెల్లించడం ద్వారా వారిలో విశ్వాసాన్ని పాదుకొల్పాలి. కొవిడ్‌-19 సమస్యను, జీఎస్టీ పరిహారం చెల్లింపుకు ముడిపెట్టకుండా, కేంద్రమే తగు చొరవతో అదనపు రుణాలను సేకరించి ఆర్ధికంగా రాష్ర్టాలను ఆదుకోవడం సముచితం. రాష్ర్టాలను బలహీనపర్చడం, సమాఖ్య స్ఫూర్తిని కాలరాయడం,  కేంద్రాన్ని నియంతృత్వ వ్యవస్థగా మార్చుకోవడం బీజేపీ ఎంచుకున్న వ్యూహం. కనుక   రాష్ర్టాల ఆవేదను అర్థం చేసుకుని ఆశించిన రీతిలో కేంద్రం ప్రవర్తిస్తుందనే విశ్వాసం అయితే కలగడం లేదు. ఇవాల్టి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం రాష్ర్టాల హక్కులను  కాపాడటం కోసం తెలంగాణ తన కంఠం విప్పి ప్రశ్నిస్తుంది. సమాఖ్య స్షూర్తిని కాపాడేందుకు కృషి చేస్తుంది.

జై తెలంగాణ  

(వ్యాసకర్త :  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat