ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల చట్టం-2020 (కొత్త రెవెన్యూ చట్టం)’ సామాన్య ప్రజలకు గొప్ప తోడ్పాటును అందించే అసామాన్య చట్టమని కేంద్ర సమాచార మాజీ కమిషనర్, బెన్నెట్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అభివర్ణించారు. భూమిని నమ్ముకున్న లక్షలమంది రైతులకు కొత్త చట్టంతో మేలు జరుగుతుందన్నారు. అవినీతికి ఆస్కారం ఇచ్చే విచక్షణాధికారాలను తొలిగించి, ప్రజలకు ప్రభుత్వం కొత్త చట్టంతో సాధికారత కల్పించిందని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టంపై ‘నమస్తే తెలంగాణ’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవీ విశేషాలు..
కొత్త రెవెన్యూ చట్టం అవసరమేంటి? దానివల్ల ప్రజలకు కలిగే లాభాలేంటి? పాత చట్టంలో లోపాలేంటి?
దశాబ్దాల నుంచి రైతులు భూమిని నమ్ముకుని బతుకుతున్నారు. వారు దానితో ఎప్పుడూ వ్యాపారం చేయలేదు. మారుతున్న పరిస్థితుల్లో భూమికి విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. రెవెన్యూ పరిభాష తెలిసి, విచక్షణాధికారాలు ఉన్నవారి జోక్యంతో అవినీతి పెరిగిపోయింది. పొలం కొనటం, అది అక్కడ ఉన్నదో లేదో తెలుసుకోవటం, హద్దులు గుర్తించటం, సదరు భూమి తనదే అని నిరూపించుకునే పత్రాలు సంపాదించటం కష్టమైపోయింది. భూ రికార్డుల్లో తప్పులు, రికార్డుల నిర్వహణలో రహస్యం, తప్పులేంటి? వాటిని సరిచేసే విధానమేంటి? మొత్తం రహస్యమే! దీనివల్లే వివాదాలకు ఆస్కారం ఏర్పడింది. సామాన్యులకు పెనుభారంగా మారింది. భూమి హక్కుల మార్పిడి కష్టతరమైన, తీవ్ర జాప్యంతో కూడిన ప్రక్రియగా మారింది. తమ భూమి తమ పేరుపైకి మార్చుకోవాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగి, లంచాలు ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ విషయంలో కొత్తగా ఎదురవుతున్న సమస్యలకు పాత చట్టాలు పరిష్కారాలు చూపలేకపోతున్నాయి. ఎన్ని డిగ్రీలు చదువుకున్నా రెవెన్యూ పరిభాష అర్థంకాని బ్రహ్మపదార్థంగా మారిపోయింది. రెవెన్యూ వ్యవస్థ అంటేనే ప్రజలకు విరక్తి కలిగే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భూవివాదాలకు పరిష్కారం చూపేలా హక్కుల మార్పిడి, నమోదు, హక్కు పత్రాలకు సంబంధించిన ప్రక్రియను వేగంగా చేపట్టి సా మాన్య ప్రజల ఇక్కట్లు తొలిగించే చట్టాలు అవసరమయ్యాయి. ప్రజల ఇబ్బందులను త్వరగా అర్థంచేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది.
చట్టం తెచ్చేముందు సుదీర్ఘ చర్చ జరిగిందా? కొత్త చట్టంలో సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నారా?
భూమి వ్యవహారాలు, రైతుల సమస్యలపై విషయ పరిజ్ఞానం కలిగి ఉన్న సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టంపై లోతైన పరిశీలన, సమీక్ష జరిపారు. అధికారులు, న్యాయ నిపుణులతో కొన్ని రోజులపాటు గంటల తరబడి చర్చించారు. చట్టంలోని ప్రతి అక్షరంపై సమాలోచనలు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా పరిష్కారాలు చూపారు. ఈ చట్టంలో పారదర్శకతకు ప్రముఖ స్థానం కల్పించారు. విచక్షణాధికారాలు అవినీతికి తావిస్తాయని.. అధికారులకున్న విచక్షణాధికారాలను తొలిగించారు. విచక్షణాధికారాల తొలిగింపు, పారదర్శకత అనే అంశాలపై ఈ చట్టం నిర్మాణమైంది. రికార్డులను రహస్యంగా ఉంచడం కూడా అవినీతికి ఊతం ఇస్తున్నదని భావించి, మొత్తం రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. కొత్త చట్టంలో ఒక్కొక్క సెక్షన్, ఒక్కొక్క పదం ఏమైనా విచక్షణాధిరాలు కల్పిస్తున్నాయా? అనేది పరిశీలించారు. ముఖ్యకార్యదర్శి స్థాయి నుంచి ప్రత్యేక కార్యదర్శి, సలహాదారులు మాత్రమే కాకుండా పంచాయతీ కార్యదర్శులు, రిటైర్డ్ అధికారుల వరకు చిన్నాపెద్దా స్థాయీభేదం లేకుండా ప్రతిఒక్కరితో చట్టం గురించి మాట్లాడారు. చట్టంలోని ప్రతి అంశాన్ని పరిశీలించాలని స్వయంగా సీఎం నన్ను కోరారు. గంటల తరబడి జరిగిన చర్చల్లో నేనూ పాల్గొన్నాను. అత్యంత శ్రద్ధతో సీఎం కేసీఆర్ స్వయంగా చట్టం రూపకల్పనను పర్యవేక్షించారు.
భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారా? కొత్తగా వచ్చే మార్పులేంటి?
దేశంలో అన్ని కోర్టుల్లో కలిపి 3.50 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 60% అంటే దాదాపు 2 కోట్ల కేసులు భూవివాదాలవే. సరైన, పటిష్ఠ చట్టాలు ఉన్నప్పుడు భూవివాదాలకు ఆస్కారం ఉండదు. విపరీతంగా పెరిగిపోతున్న భూవివాదాలకు పరిష్కారం చూపాలన్న సదుద్దేశంతో సర్కారు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిద్వారా ప్రభుత్వం ప్రధానంగా మూడు రకాల మార్పులను చేయాలని సంకల్పించింది. 1.ధరణి పోర్టల్ ద్వారా భూరికార్డుల్లో పారదర్శకత, 2.అధికారులకు ఉన్న విచక్షణాధికారాల తొలిగింపు, 3.రెవెన్యూ కోర్టుల రద్దు. సమగ్ర భూసర్వేను పూర్తిచేసి, రెవెన్యూ రికార్డులను ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచితే భూరికార్డుల నమోదులో జరిగే దారుణాలను సమూలంగా నిర్మూలించవచ్చు. కొత్త చట్టం ద్వారా తప్పుల్లేని రికార్డులు, క్రయవిక్రయాలను వెనువెంటనే నమోదు చేయటం, హక్కులను బదిలీ చేయటం, మ్యుటేషన్ పత్రాలు వెంటనే అందించడం వెంటవెంటనే జరిగిపోతాయి. దీనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున ఉపయోగించి, ప్రతి గ్రామంలోని రికార్డులను నవీకరించి ధరణి పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. నూతన చట్టంలోని అంశాలను పకడ్బందీగా అమలుచేస్తే కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న దాదాపు 66% భూవివాదాలకు పరిష్కారాలు లభిస్తాయి. ప్రజలకు, ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఖర్చులు ఆదా అవుతాయి.
ఆన్లైన్ సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే పరిస్థితేంటి? హ్యాకింగ్‌కు పాల్పడితే రికార్డులు మొత్తం పోతాయి కదా!
ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్ చేసే ప్రతి నమోదును లిఖితపూర్వకంగా ఆఫ్‌లైన్‌లో నమోదుచేసిన తర్వాతే ఆన్లైన్లో చేయాలని చట్టంలో స్పష్టంగా ఉన్నది. ఆఫ్‌లైన్ రికార్డుల నిర్వహణలో అనుమానాలకు తావులేదు. ఆన్లైన్ రికార్డులతో సమానంగా ఆఫ్‌లైన్ రికార్డులనూ నిర్వహిస్తారు. కొందరు పూర్తిగా తెలుసుకోకుండా మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందని భావిస్తున్నారు.
రెవెన్యూ కోర్టులను, వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దుచేసింది. అలాంటప్పుడు ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించవచ్చు?
ఆస్తులకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తిచేసి అన్ని పత్రాలు జారీచేసిన తర్వాత వాటిపై తలెత్తే వివాదాలను తామే పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పటం సమంజసం కాదని భావించి రెవెన్యూ కోర్టుల రద్దుకు నిర్ణయించారు. రెవెన్యూ కోర్టుల్లో అవినీతి, పూర్తి పెత్తనం అధికారులకు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నట్టు గుర్తించింది. ఇప్పటికే ఈ కోర్టుల్లో ఉన్న కేసులను తాత్కాలిక ట్రిబ్యునళ్లు పరిష్కరిస్తాయి. కొత్తగా ఏర్పడే వివాదాలను కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. భూరికార్డులు రహస్యంగా ఉండటం వల్ల ఇంతకాలం వీఆర్వోల అవసరం ఉండేది. గతంలో వీఆర్వోలు నిర్వహించిన పనులను సాంకేతిక పరిజ్ఞానం భర్తీ చేస్తుంది. ప్రస్తుతం కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటే సరిపోతుంది. మీసేవ లాంటి కేంద్రాల ద్వారా ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తక్షణం పరిష్కరించవచ్చు. కొత్త రెవెన్యూ చట్టం రైతులు, సామాన్య ప్రజల కష్టాలను తొలిగిస్తుంది. రోజుల తరబడి తిరిగే శ్రమను దూరం చేస్తుంది. క్రయవిక్రయాలు, వారసత్వ హక్కులకు సంబంధించి ప్రజలు ఒప్పందాలు చేసుకుని రిజిస్ర్టేషన్ చేయించుకోవడానికి వస్తే కాదనే హక్కు అధికారులకు ఉండదు. ఈ చట్టం ద్వారా అధికారులకు బాధ్యతలు ఉంటాయే తప్ప విచక్షణాధికారాలు ఉండవు. గతంలో రిజిస్ట్రేషన్ ఫీజును అధికారులు నిర్ణయించేవారు. ప్రస్తుతం ఆ విధానం ఉండదు. ఫీజులు ఎంత వసూలు చేయాలో ఆన్లైన్ వ్యవస్థ నిర్ధారిస్తుంది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వెంటనే జరిగిపోతాయి.
అటవీ హక్కు చట్టాలు, గిరిజన భూహక్కు చట్టాలకు సంబంధించిన విషయాల్లో కొత్త చట్టం జోక్యం ఉంటుందా?
కొత్త రెవెన్యూ చట్టం కొత్తగా హక్కులను కల్పించదు. ఉన్న హక్కులను మాత్రమే నిర్ధారిస్తుంది. రెవెన్యూ విభాగంలో దాదాపు 150 చట్టాలు ఉన్నాయి. ఆయా చట్టాల ద్వారా సంక్రమించిన హక్కులను చట్టం నిర్ధారిస్తుంది. ఉన్న హక్కులను రికార్డు చేసి, హక్కు పత్రాలను ఇస్తుంది. అటవీహక్కు చట్టాలు, గిరిజన భూహక్కు చట్టాల విషయాల్లో కొత్త చట్టం జోక్యం ఉండదు. ఆయా చట్టాల కింది వ్యవస్థలు అలాగే ఉంటాయి.
కొత్త చట్టాన్ని ఏ విధంగా అభివర్ణిస్తారు?
కొత్త రెవెన్యూ చట్టం విప్లవాత్మకమైనది. గతంలోనూ ఈ తరహా సంస్కరణలు తేవాలని చాలామంది సీఎంలు భావించారు. కానీ అందరికీ సాధ్యంకాలేదు. అలాంటి క్లిష్టమైన పనిని సీఎం కేసీఆర్ చేసి చూపించారు. కొత్త చట్టం ద్వారా రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతను ప్రవేశపెట్టాలన్న గొప్ప సంకల్పంతో ముందడుగు వేశారు. ఇదేస్ఫూర్తితో అన్ని శాఖల్లో గొప్ప విప్లవాత్మక చట్టాలు రావాలి. ప్రధానంగా అవినీతికి ఆస్కారం ఉండే పౌరసరఫరాల వంటి విభాగాల్లో పూర్తి పారదర్శకంగా ఉండే విధానాలు రావాలి. వ్యవస్థను పూర్తి పారదర్శకంగా, ఆన్లైన్లో నిర్వహించేలా ఉండాలి. రాజస్థాన్‌లో జనతా సమాచార వేదిక అనే వ్యవస్థను ప్రవేశపెట్టి 250 శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. అక్కడి ప్రజాపంపిణీ వ్యవస్థలో పూర్తి పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతినెలా ఎవరు సరుకులు తీసుకున్నారు, తీసుకోని వారెందరు అన్నది ఇట్టే తెలిసిపోతుంది. దాని ప్రకారమే స్టాక్ కేటాయిస్తారు. స్టాక్ వచ్చిన విషయాన్ని ప్రజలకు సందేశాల ద్వారా చేరవేస్తారు. ఇలాంటి పారదర్శక విధానాలు అన్ని శాఖలు, అన్ని స్థాయిల్లో రావాలి. అవినీతికి అవకాశం లేని వ్యవస్థ ఉండటం సుపరిపాలనకు సంకేతం.
కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆ శాఖ ఉద్యోగులకు వ్యతిరేకంగా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మీరేమంటారు?
అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టంలో పారదర్శక విధానాలకు పెద్దపీట వేసింది. అంతేతప్ప దీనిని రెవెన్యూ ఉద్యోగులకు వ్యతిరేకంగా చేసిందనే భావన సమంజసం కాదు. రికార్డులు అందరికీ అందుబాటులో ఉండటం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వేగవంతంగా చేయటం, విచక్షణాధికారులు లేకపోవడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. దీని ద్వారా అవినీతికి ఆస్కారం అనేది ఉండదు. వీఆర్వోల వ్యవస్థ రద్దయినా వాస్తవానికి ఈ చట్టం ద్వారా రెవెన్యూ ఉద్యోగులకు అధికారాలు పెరిగాయి. తాసీల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికారాలు ఇచ్చారు. వీఆర్ఏలకు కూడా బాధ్యతలు అప్పగిస్తున్నారు.
భూమి వ్యవహారాలు, రైతుల సమస్యలపై పరిజ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టంపై లోతైన పరిశీలన, సమీక్ష జరిపారు. అధికారులు, న్యాయనిపుణులతో కొన్ని రోజులపాటు గంటల తరబడి చర్చించారు. చట్టంలోని ప్రతి అక్షరంపై సమాలోచనలు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా పరిష్కారాలు చూపారు. పారదర్శకతకు ప్రముఖ స్థానం కల్పించారు. విచక్షణాధికారాల తొలిగింపు, పారదర్శకత అనే అంశాలపై ఈ చట్టం నిర్మాణమైంది.
– కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ BY Namasthe Telangana