Home / EDITORIAL / ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు

ఇటీవల సంగారెడ్డిలో కిసాన్ మజ్దూర్ దివాస్ పేరిట రైతు దీక్ష నిర్వహించారు. మోదీ సర్కారు తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఈ నిరసన జరిగింది. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణికం ఠాగూర్ నియామకమైన తర్వాత జరిగిన పెద్ద ప్రోగ్రాం ఇది. దీనికి మాణికం ఠాగూర్ ముఖ్యఅతిథిగా హాజరై సంగారెడ్డి గంజ్ మైదానంలో దీక్ష చేశారు. ఈయనతోపాటు టీపీసీసీ ముఖ్యనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బోసు రాజు, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, గీతారెడ్డి వంటి చాలామంది నేతలే సంగారెడ్డికి వచ్చారు. వీరికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. సంగారెడ్డి అంతటా మాణికం ఠాగూర్, బోసు రాజు, దామోదర తదితరుల ఫ్లెక్సీలే కనిపించాయి. ఇలా కిలోమీటర్ల పొడవున బైక్ ర్యాలీ, ఫ్లెక్సీలు, నాయకులు, కార్యకర్తల హడావుడి.. ఠాగూర్ మనసుని జగ్గారెడ్డి మెప్పించారనే చర్చకు దారితీసింది.

అవేవీ పట్టించుకోకుండా…

రైతు దీక్ష సభలో ఠాగూర్ నుంచి మొదలుకొని జగ్గారెడ్డి వరకూ అందరూ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లను తిట్టిపోశారు. ఈ నేతలిద్దరూ రైతు వ్యతిరేకులనీ, రైతు ద్రోహులనీ నిందించారు. ఇలా ప్రతి నేతా వీరావేశంతో ప్రసంగించి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి రెండో వైపు చూస్తే.. రైతు దీక్ష ఎటువైపు పోతుందనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. మీటింగ్ దారితప్పినట్లు అక్కడికి వచ్చినోళ్లకు అనిపించినా.. ముఖ్యనేతలు మాత్రం అవేమీ పట్టించుకున్నట్లు కనిపించలేదు. జగ్గారెడ్డి మర్యాద, ఏర్పాట్లు, దీక్షకు వచ్చిన జనం వంటివి మాత్రం మాణికం ఠాగూర్‌ దృష్టిని ఆకర్షించాయట. 2023 ఎన్నికల్లో తెలంగాణలో 79 సీట్లు గెలిచి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి కావడం ఖాయమంటూ కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. దీంతో జగ్గారెడ్డి అనుచరగణం చప్పట్లు, ఈలలతో సభ మార్మోగింది. అప్పటికే ఓసారి మాట్లాడి ఉపన్యాసాన్ని ముగించిన జగ్గూదాదా… మాణికం స్పందన తర్వాత మైక్ తీసుకుని మళ్లీ మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పదికి పది అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. మంత్రులయ్యేది ఒకరిద్దరు కాదనీ, పదికి పది మంది మంత్రులవుతారనీ, కానీ జగ్గారెడ్డి మాత్రం లాస్ట్ మంత్రి అవుతారనీ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆయన పది అంటే.. ఈయన ఐదు అని…

ఇక జగ్గారెడ్డి కామెంట్స్ విన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా మరో మైకు తీసుకుని చెప్పిన మాట కూడా చర్చకు దారితీసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పది అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ గెలిస్తే పది కాదు.. ఐదుగురికి మంత్రి పదవులు కచ్చితంగా వస్తాయని సెలవిచ్చారు. వీరి వ్యాఖ్యలు విన్న కొందరు.. ఒకాయనేమో థర్టీ ఫైవ్ ఎంఎంలో సినిమా చూపించారనీ, ఇంకొకరు సెవెంటీ ఎంఎంలో సినిమా చూపించారనీ చెవులు కొరుక్కున్నారు. కాంగ్రెస్ నేతల మధ్య మంత్రి పదవుల పంపిణీపై కొనసాగిన సంభాషణను చూసి చాలామంది ఇదేం విడ్డూరమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంకొందరైతే.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందని జోకులేసుకున్నారు.

ఉండేదెవరో.. గోడ  దూకేదెవరో…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయముంది. అప్పటివరకు పార్టీలో ఉండేదెవరో గోడ దూకేదెవరో తెలియదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాంగ్రెస్ పరిస్థితి చూస్తూ… భవిష్యత్తును ఊహించుకోవడం కష్టమే. కానీ.. కాంగ్రెస్ ముఖ్య నేతలు మాత్రం నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు వ్యవహరించారని గుసగుసలు వినిపించాయి. మాణికం ఠాగూర్ విజన్ 2023 అని చెబితే.. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాత్రం ఒక అడుగు ముందుకేసీ ఏడాది కాలాన్ని తగ్గించారు. ఠాగూర్ చెప్పినట్లు విజన్ 2023 కాదు 2022 అని సెలవిచ్చారు. కేసీఆర్ ఎప్పుడూ నాలుగేళ్లకు ఎక్కువ కాలం పరిపాలన చేయరట. అందుకే ఈసారి కూడా ఏడాది ముందే ఎన్నికలు వస్తాయట.  ఇలాంటి సమయంలో అధికార పార్టీ వైఫల్యాలపై దూకుడుగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ నేతలు.. అప్పుడే  అధికారంలోకి వచ్చినట్లుగా మంత్రి పదవులను పంచేసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెసోళ్లు మారరా..!? అన్న నిట్టూర్పులు సైతం వ్యక్తమవుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat