తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ నటుడు,పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కి జంటగా శ్రుతీ హాసన్ వకీల్ సాబ్ చిత్రంలో సందడి చేయనున్నసంగతి విదితమే. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే… ఇప్పటివరకూ శ్రుతి సెట్స్‌కి రాలేదు. డిసెంబర్‌లో ‘వకీల్ సాబ్’తో కలిసి ఆమె చిత్రీకరణలో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పవన్, ఇతర తారాగణంపై తెరకెక్కిస్తున్న సన్నివేశాల చిత్రీకరణ ఈ నెలలో పూర్తవుతుందట.
వచ్చే నెలలో హీరో హీరోయిన్లపై పది నుంచి పదిహేను రోజులపాటు చిత్రీకరణ చేస్తారని తెలిసింది. దాంతో సినిమా షూటింగ్ అంతా పూర్తవుతుందని తెలుస్తోంది. ఇందులో శ్రుతీ హాసన్ కనిపించేది కాసేపే.
అయితే… పవన్, శ్రుతీది హిట్ జోడీ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ‘గబ్బర్ సింగ్’లో తొలిసారి ఈ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ‘కాటమరాయుడు’లో సందడి చేసింది. ఇప్పుడీ ‘వకీల్ సాబ్’లో మూడోసారి జోడీగా కనిపించనున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.