Home / SLIDER / ప్రజల నోటి కాడి కూడు ఎత్తగొట్టారు : సీఎం కేసీఆర్‌

ప్రజల నోటి కాడి కూడు ఎత్తగొట్టారు : సీఎం కేసీఆర్‌

కరోనా వచ్చి, డబ్బులు లేక, ఇబ్బందులు ఉన్నా, మన జీఎస్టీ ఇవ్వకపోయినా ఉన్నంతలో పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా బీజేపీ అడ్డుపడిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. వరదల భారిన పడి ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేస్తుంటే చిల్లర రాజకీయం చేసి అడ్డుపడిన బీజేపీ తీరు అమ్మ పెట్టదు.. అడుక్కొని తీననీయదు అన్నట్లుగా ఉందని సీఎం అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం మనం అడిగితే ఒక్క పావలా కూడా ఇవ్వట్లేదన్నారు. కనీసం రూపాయి కూడా ఇవ్వకపోగా ఇచ్చినట్టుగా దొంగమాటలు చెబుతుందన్నారు. ఇది వంచనశిల్పం దీన్ని ఎండగట్టాలన్నారు. బీజేపీ అబద్దాల ప్రచారాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బద్దలుకొట్టాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ శక్తి ఎందో రుచి చూపించాలన్నారు.

కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సాయం చేసినమని చెబితే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉందా అని ప్రశ్నించారు. చిల్లర గొడవలు సృష్టిస్తున్నారని మీ సేవా ద్వారా ఇస్తమంటే కూడా దాన్ని కూడా అడ్డుకుని ప్రజల నోటి కాడి కూడు ఎత్తగొట్టారు. ఇది చాలా బాధాకరం అన్నారు. ఎన్నికల తర్వాత వరద బాధితులకు సాయం అందిస్తామని సీఎం పేర్కొన్నారు.