Home / BUSINESS / అసలు వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీలో ఏముంది.?

అసలు వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీలో ఏముంది.?

కొన్ని రోజులుగా వాట్సాప్ అంటేనే తెగ మండిప‌డుతున్నారు ప్ర‌పంచవ్యాప్తంగా ప‌లువురు యూజ‌ర్లు. ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ల‌లో 200 కోట్ల యూజర్ల‌తో టాప్ ప్లేస్‌లో ఉన్న వాట్సాప్‌.. త‌మ ప్రైవ‌సీ పాల‌సీని మార్చ‌నుండ‌ట‌మే దీనికి కార‌ణం. ఇప్ప‌టికే ఈ కొత్త ప్రైవ‌సీ పాల‌సీల‌కు సంబంధించి నోటిఫికేష‌న్లు యూజ‌ర్ల‌కు వ‌స్తున్నాయి. వీటికి ఫిబ్ర‌వ‌రి 8లోగా అంగీక‌రిస్తేనే త‌మ సేవ‌ల‌ను వినియోగించుకుంటార‌ని వాట్సాప్ స్ప‌ష్టం చేస్తోంది. ఈ కొత్త రూల్స్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న యూజ‌ర్లు.. మెల్ల‌గా సిగ్న‌ల్‌, టెలిగ్రామ్‌లాంటి  ఇత‌ర యాప్‌ల‌కు వెళ్లిపోవడానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు వాట్సాప్ కొత్త ప్రైవ‌సీ పాల‌సీలో ఏముంది? ఇందులో భాగంగా ఆ సంస్థ సేక‌రించే డేటా ఏంటో ఒక‌సారి చూద్దాం.

ఫేస్‌బుక్‌తో వాట్సాప్ ఏం పంచుకుంటుంది?

కొత్త ప్రైవ‌సీ పాల‌సీలో భాగంగా యూజ‌ర్ల డేటాను త‌న మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామ‌ని వాట్సాప్ స్ప‌ష్టంగా చెబుతోంది. అయితే ఈ డేటా ఏంటి?  మీ నుంచి వాట్సాప్ ఆటోమేటిగ్గా సేక‌రించే డేటా మొత్తం ఫేస్‌బుక్‌కు వెళ్లిపోతుంది. ఇందులో మీ మొబైల్ నంబ‌ర్‌, వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకునే స‌మ‌యంలో మీరు ఇచ్చే క‌నీస స‌మాచారం ఉంటుంది. అంతేకాకుండా యూజ‌ర్ యాక్టివిటీ, వాట్సాప్ ఎంత త‌ర‌చుగా వాడుతున్నారు, వినియోగించే ఫీచ‌ర్లు, ప్రొఫైల్ ఫొటో, స్టేట‌స్‌, అబౌట్ స‌మాచారం అంతా వాట్సాప్ సేక‌రిస్తుంది. మీ డివైస్ నుంచి మీ క‌చ్చిత‌మైన లొకేష‌న్‌ను కూడా మీ అనుమ‌తితో సేక‌రిస్తుంది. ఈ స‌మ‌చారాన్నంతా ఫేస్‌బుక్‌, దాని ఇత‌ర ప్రోడ‌క్ట్స్ కూడా ఉప‌యోగించే అవ‌కాశం ఉంటుంది. ఇందులో ఫేస్‌బుక్‌తోపాటు మెసెంజ‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ షాప్స్‌, స్పార్క్ ఏఆర్ స్టూడియో, ఆడియెన్స్ నెట్‌వ‌ర్క్‌లాంటివి ఉన్నాయి.

మ‌నం పంపిన మెసేజ్‌ల సంగ‌తేంటి?

దీనిపై వాట్సాప్ మొద‌టి నుంచీ చెబుతున్న‌ది ఒక‌టే. మీ మెసేజ్‌ల‌న్నీ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసిన‌వి అని. అంటే ఆ మెసేజ్‌ల‌ను మీరు పంపిన వ్య‌క్తి త‌ప్ప వాట్సాప్‌గానీ, ఇత‌ర థ‌ర్డ్ పార్టీ వాళ్లు కానీ చ‌ద‌వ‌లేరు. మెసేజ్‌లు, ఫొటోలు, అకౌంట్ స‌మాచారాన్ని ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోమ‌ని వాట్సాప్ స్ప‌ష్టం చేస్తోంది. మీరు మెసేజ్‌ల‌ను పంపిన త‌ర్వాత వాటిని వాట్సాప్ స్టోర్ చేయ‌దు. ఈ మెసేజ్‌ల‌న్నీ యూజ‌ర్ల ద‌గ్గ‌ర ఉంటాయి త‌ప్ప‌.. వాట్సాప్ స‌ర్వ‌ర్లలో కాదు. డెలివ‌ర్ కాని మెసేజ్‌ల‌ను మాత్రం వాట్సాప్ ఎన్‌క్రిప్టెడ్ రూపంలో 30 రోజుల వ‌ర‌కు స్టోర్ చేస్తుంది. అప్ప‌టికీ డెలివ‌ర్ కాక‌పోతే ఆ త‌ర్వాత డిలీట్ చేస్తుంది.

మ‌న ట్రాన్సాక్ష‌న్ డేటా సంగ‌తేంటి?

తాజాగా వాట్సాప్ ఇండియాలో పేమెంట్స్ ఫీచ‌ర్‌ను కూడా లాంచ్ చేసింది. వాట్సాప్ పే ద్వారా లావాదేవీలు చేస్తే.. అందుకు సంబంధించిన అద‌న‌పు స‌మాచార‌మైన పేమెంట్ ఖాతా, ట్రాన్సాక్ష‌న్ స‌మాచారాన్ని కూడా సంస్థ ప్రాసెస్ చేస్తుంది. ట్రాన్సాక్ష‌న్ పూర్తి చేయ‌డానికి ఈ స‌మాచారం త‌ప్ప‌న‌సరి అని వాట్సాప్ చెబుతోంది. దీనికి సంబంధించిన పేమెంట్స్ ప్రైవ‌సీ పాల‌సీలో వీటి నిబంధ‌న‌ల‌ను చూసుకోవ‌చ్చ‌ని సంస్థ వెల్ల‌డించింది.

యాడ్స్ సంగ‌తేంటి?

మూడో పార్టీ యాడ్స్‌ను వాట్సాప్ అనుమ‌తించ‌దు. భ‌విష్య‌త్తులోనూ యాడ్స్‌ను ప‌రిచ‌యం చేసే ఆలోచ‌న లేద‌ని, ఒక‌వేళ అలా చేస్తే ప్రైవ‌సీ పాల‌సీ అప్‌డేట్ చేస్తామ‌ని సంస్థ చెబుతోంది. అయితే మీ నుంచి సేక‌రించిన స‌మాచారాన్ని వాళ్ల సేవ‌ల గురించి మార్కెట్ చేసుకోవ‌డానికి వినియోగించే అవ‌కాశం ఉంది. అదే స‌మాచారాన్ని ఫేస్‌బుక్‌తోపాటు దాని అనుబంధ సంస్థ‌ల‌కు షేర్ చేయ‌వ‌చ్చు.

వాట్సాప్ బిజినెస్ సంగ‌తేంటి?

వాట్సాప్ ఈ మ‌ధ్యే వాట్సాప్ బిజినెస్ కూడా ప్రారంభించింది. దీని ద్వారా చిన్న వ్యాపార‌స్థులు త‌మ క‌స్ట‌మ‌ర్ల‌తో ఈ యాప్ ఉప‌యోగించి క‌మ్యూనికేట్ చేసుకోవ‌చ్చు. యాప్ ద్వారా కొనుగోళ్లు చేసుకోవ‌డంతోపాటు వ్యాపారాలు మిమ్మ‌ల్ని సంప్ర‌దించ‌వ్చు.. మీ ఆర్డ‌ర్ల‌ను ఖ‌రారు చేసుకోవ‌చ్చు, టికెట్ బుకింగ్‌ల‌ను ఖ‌రారు చేయ‌వ‌చ్చు. అయితే దీని ద్వారా వ్యాపారాల‌తో మీరు చేసే చాట్స్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అని, ఒక‌సారి మీ నుంచి మెసేజ్ అందుకున్న త‌ర్వాత అది  సంబంధిత బిజినెస్ సొంత ప్రైవ‌సీ పాలసీ కిందికి వ‌స్తుంద‌ని వాట్సాప్ స్ప‌ష్టం చేసింది. కొన్ని సంస్థ‌లు త‌మ డేటాను స్టోర్ చేసుకోవ‌డం కోసం వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్‌ను ఎంచుకుంటాయ‌ని వాట్సాప్ చెబుతోంది. అయితే మీ స‌మాచారాన్ని ఫేస్‌బుక్ నేరుగా వినియోగించుకోక‌పోయినా.. సంబంధిత వ్యాపార సంస్థ‌లు త‌మ మార్కెటింగ్ కోసం వాడుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు కూడా వాట్సాప్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

మ‌రి యూజ‌ర్లు ఏం చేయాలి?

వాట్సాప్‌లో కొనసాగాలంటే ఈ కొత్త నియ‌మ నిబంధ‌న‌లు, ప్రైవ‌సీ పాల‌సీకి యూజ‌ర్లు ఓకే చెప్పాల్సిందే. ఒక‌వేళ వ‌ద్దు అనుకుంటే మీ అకౌంట్ డిలీట్ చేసుకోవాలి. ఒక‌వేళ మీరు ఇప్ప‌టికే ఈ కొత్త నిబంధ‌న‌ల‌కు ఓకే చెప్పి.. మీ డేటాను వాట్సాప్ వాడుకోవ‌డం ఇష్టం లేక‌పోతే.. మీకు కూడా ఇందులో నుంచి త‌ప్పుకోవ‌డానికి, అకౌంట్ డిలీట్ చేసుకోవ‌డానికి అద‌నంగా 30 రోజుల స‌మ‌యం ఉంటుంది.

ఒక‌వేళ డిలీట్ చేస్తే..

ఒక‌వేళ మీరు మీ వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేస్తే మీ డెలివ‌రీ కాని మెసేజ్‌ల‌తోపాటు మీ స‌మాచారం కూడా వాట్సాప్ స‌ర్వ‌ర్ల నుంచి డిలీట్ అవుతాయి. అయితే మీరు కేవ‌లం వాట్సాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయ‌కుండా.. ఆ అకౌంట్‌ను ముందుగా డిలీట్ చేయ‌డం మ‌ర‌చిపోవ‌ద్దు. అకౌంట్ డిలీట్ చేయ‌డం కోసం సెటింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఎంపిక చేసుకొని డిలీట్ మై అకౌంట్‌పై నొక్కండి. అయితే మీరు మీ అకౌంట్‌ను డిలీట్ చేసినా కూడా మీరు ఇత‌ర యూజ‌ర్ల‌కు పంపిన స‌మాచారంపై ఇది ఎలాంటి ప్ర‌భావం చూప‌ద‌ని వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీ చెబుతోంది.