అటు గ్లామరస్ పాత్రల్లోనూ, ఇటు పవర్‌ఫుల్ పాత్రల్లోనూ నటించి లేడీ అమితాబ్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో కమర్షియల్ హీరోయిన్‌గానూ, ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాల కథానాయికగానూ సత్తా చాటారు.
అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి వెండితెరకు దూరమయ్యారు. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో పునరాగమనం చేశారు.
ఆ సినిమాలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించి తనలోని స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. దీంతో విజయశాంతికి టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. భారీ పారితోషికం ఇస్తామని పలువురు నిర్మాతలు ముందుకొచ్చారు. అయితే బీజేపీలో చేరి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నందున సినీ జీవితాన్ని కొనసాగించకూడదని విజయశాంతి నిర్ణయించుకున్నారు.
తనను సంప్రదించిన వారందరికీ `నో` చెప్పారు. `ఇకపై సినిమాలు చేయన`ని సోషల్ మీడియా ద్వారా కూడా ప్రకటించారు. అయితే తాజాగా విజయశాంతిని ఓ పాత్ర ఆకర్షించినట్టు సమాచారం.
గతంలో విజయశాంతి ప్రధాన పాత్రలో `భారతరత్న` సినిమాను నిర్మించిన ప్రతిమా ఫిల్మ్స్ సంస్థ తాజాగా ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్ సిద్ధం చేయించిందట. దేశభక్తి నేపథ్యంలో పవర్‌ఫుల్‌గా ఈ కథ ఉంటుందట. విజయశాంతితో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రం షూటింగ్ పూర్తిగా కశ్మీర్‌లోనే ఉంటుందట. ఈ కథ తన ఇమేజ్‌కు సరిగ్గా సరిపోతుందని, ఈ సినిమా చేయాలని విజయశాంతి అనుకుంటున్నారట. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ త్వరలోనే బయటకు రాబోతున్నట్టు సమాచారం.