Home / SLIDER / ఫలించిన ‘సోషల్‌’ వ్యూహం!

ఫలించిన ‘సోషల్‌’ వ్యూహం!

ఒకప్పుడు ఇంటింటి ప్రచారం, గోడరాతలు, కరపత్రాలు, పోస్టర్లు కనిపించేవి. కానీ ఇప్పుడంతా ‘నెట్టింట’ ప్రచారమే హోరెత్తుతున్నది. వ్యూహ ప్రతివ్యూహాలు, విమర్శలు.. ఎదురుదాడులు.. అంతా సోషల్‌ మీడియాలోనే. తాజాగా హోరాహోరీగా జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లోనూ సోషల్‌ మీడియా ప్రధాన భూమిక పోషించింది. బీజేపీ 2014 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచే సోషల్‌మీడియాను విరివిగా వాడుకుంటూ లబ్ధి పొందుతున్నది. ప్రత్యర్థులపై దాడికి, ఆరోపణలకు, విమర్శలకు సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతున్నది. ఇందుకోసం ఏకంగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేసుకుంది. బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్‌ సైతం సోషల్‌ మీడియా సైన్యాన్ని రంగంలోకి దించింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ గ్రూపులు, యూట్యూబ్‌ ఇలా అన్ని వేదికలను టీఆర్‌ఎస్‌ బాగా ఉపయోగించుకున్నది. దీనికి తోడు రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనదైన శైలిలో పోస్టులతో ట్విట్టర్‌ వేదికగా ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.

పట్టభద్రుల ఎన్నిక కావడంతో.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేస్తున్న అభివృద్ధి పనులు, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం ఒక్కోరంగంలో దూసుకుపోతున్నదానిపై వివరించిన తీరు యువ ఓటర్లను ఆకట్టుకుంది. ఉద్యోగ కల్పనపై నిరుద్యోగులను గందగోళపర్చేలా బీజేపీ, కాంగ్రెస్‌, ఇతర పక్షాలు చేసిన ప్రచారాన్ని మంత్రి కేటీఆర్‌ ఫిబ్రవరి 25న రాసిన బహిరంగ లేఖతో తిప్పికొట్టారు. ఏయే విభాగంలో ఎన్ని కొలువులు ఇచ్చారో బల్లగుద్దినట్టు బరాబర్‌ చెప్పడంతో ప్రతిపక్షాల గొంతులో వెలక్కాయపడ్డటయింది. సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను టీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా విభాగం ఫొటోలు, చిన్నచిన్న క్యాప్షన్లతో చేసిన ప్రచారం ఓటర్లను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేసింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టడంలో సైతం సఫలీకృతమైంది.

పక్కాగా పల్లా వ్యూహం
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినది మొదలు ప్రచారం ముగిసే వరకు నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పక్కా వ్యూహంతో దూసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ఆరేండ్లలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు, పెద్ద సంఖ్యలో ఐటీ, ఇతర ప్రపంచస్థాయి పరిశ్రమలను రాష్ర్టానికి తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చిన తీరును అటు సోషల్‌ మీడియాలో ఇటు టీవీ చానెళ్ల చర్చా కార్యక్రమాల్లో పూసగుచ్చినట్టు వివరించిన తీరు.. యువ ఓటర్లను ఆకట్టుకుంది. ప్రత్యర్థుల ఆరోపణలకు లైవ్‌ డిబేట్లలో ఎక్కడా అక్షర తొట్రుపాటు లేకుండా లెక్కలతో సహా ఆయన వివరిస్తూ పోయారు. ఈ వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం..అవి యువతకు బాగా రీచ్‌ కావడం ఆయనకు కలిసొచ్చింది.

టీఆర్‌ఎస్‌కే జైకొట్టిన యువ ఓటర్లు!
హైదరాబాద్‌, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు అసత్యమని పట్టభద్రులు స్పష్టంచేశారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో యువ ఓటర్లు టీఆర్‌ఎస్‌కు జై కొట్టారు. విమర్శలు, ఆరోపణలు పక్కన పెట్టి వాస్తవాలు గుర్తించిన తెలంగాణ యువత సరైన నిర్ణయాన్ని తీసుకున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సురభి వాణీదేవిని గెలిపించటం ద్వారా లక్షా 32 వేలకు పైగా ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం చెప్పిన లెక్కలన్నీ సరైనవేనని పట్టభద్రులు ఆమోదం తెలిపారు. త్వరలోనే 50వేల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న ప్రభుత్వ ప్రకటనను పూర్తిగా విశ్వసించిందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల తీరు స్పష్టంచేస్తున్నది. ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్‌ను, తామే గొప్ప అని చెప్పుకునే బీజేపీని యువత అస్సలు విశ్వసించడం లేదని ఈ ఎన్నికలతో స్పష్టమైంది. ఉమ్మడి 6 జిల్లాల పరిధిలో జరిగిన ఈ ఎన్నికలు యావత్‌ తెలంగాణ యువత ఆలోచనకు అద్దం పడుతున్నాయి. ఉద్యోగాల విషయంలో టీఆర్‌ఎస్‌ చేస్తున్న కృషికి మద్దతు తెలుపుతున్నాయి.