శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్ ఐపాస్ కింద వచ్చిన పరిశ్రమలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత గత ఆరు సంవత్సరాల్లో టీఎస్ ఐపాస్ కింద 15,326 పరిశ్రమలు ఆమోదం పొందాయన్నారు. ఇందులో ఇప్పటికే 11,954 పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు.
టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 లక్షల 13 వేల 431 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. కాగా ప్రస్తుతం రూ. 97,405 కోట్ల పెట్టుబడులు తమ కార్యక్రమాలను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పెట్టుబడుల ద్వారా 15,52,672 మందికి ఉపాధి కల్పించొచ్చని అంచనా వేశామన్నారు. ప్రస్తుతం 7,67,729 మంది ఉపాధి పొందుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
2014, నవంబర్‌లో టీఎస్ ఐపాస్ చట్టాన్ని ఆమోదించుకున్నామని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలో పారిశ్రామీకీకరణకు సహాయం చేయాలని, రాయితీలు ఇస్తామని పేర్కొన్నప్పటికీ ఎలాంటి సాయం అందలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుందన్నారు. వెనుకబడిన జిల్లాలకు కూడా పరిశ్రమలను విస్తరిస్తామని మంత్రి తెలిపారు.
ఏరోస్పేస్ ఇండస్ర్టీ తీసుకుంటే ఆదిభట్ల ప్రాంతంలో ఉంది. ఎలక్ర్టిక్ పరిశ్రమలు హైదరాబాద్‌కు దక్షిణం వైపు ఉన్నాయి. పరిశ్రమలును వికేంద్రీకరిస్తామని తెలిపారు. నైపుణ్య శిక్షణతోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. టాస్క్ సమర్థవంతంగా పని చేస్తూ.. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తుందన్నారు. ఆత్మ నిర్భర్ వల్ల రాష్ర్టానికి ఏం లాభం జరగలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.