Home / EDITORIAL / విద్రోహులతో దోస్తీ ఆత్మాభిమానమా?

విద్రోహులతో దోస్తీ ఆత్మాభిమానమా?

వ్యవసాయ భూమి ఉన్నా నీటి సౌక ర్యం లేకుంటే నిష్ప్రయోజనమే. అందుకే నీటి సౌకర్యం కల్గించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల ఆకలి తీర్చడానికి ఆరుగాలం కష్టపడే రైతుకు కేసీఆర్‌ అండగా నిలిచారు. కోటి ఎకరాలకు నీటివసతి కల్పించడం లక్ష్యంగా కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టును, అనుబంధ ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మింపజేశారు.

సీమాంధ్ర పాలనలో తెలంగాణ ఎంత విలవిలలాడిందో గమనించిన వారికి మన రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిందేమిటో అర్థమవుతుంది. దశాబ్దాల పాటు వలస పాలకుల పదఘట్టనల కింద తెలంగాణ నలిగిపోయింది. భాష, చరిత్ర, సాంస్కృతికపరమైన వివక్షతో పాటు సాహిత్య, రాజకీయ వివక్షనూ దశాబ్దాలుగా అనుభవించింది. ప్రకృతి విధ్వంసం భారీగా సాగింది. రైతులు, నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దారుణ స్థితిగతులుండేవి. ఈ నేపథ్యంలో ఒక చారిత్రక అవసరంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ స్థాపించి రాష్ట్రసాధన ఉద్యమాన్ని ప్రారంభించారు.

విద్రోహులతో దోస్తీ ఆత్మాభిమానమా?

తెలంగాణ గురించి అణువణువూ తెలిసిన నాయకుడు కేసీఆర్‌. ఆయన తెలంగాణ కోసం ఉద్యమిస్తుంటే, ఆంధ్ర నాయకు లు, వారి తాబేదారులు పలురకాలుగా నిందలు వేశారు. తెలంగాణలోని ఇతర పార్టీల నాయకులూ ఆంధ్రానాయకుల మెప్పు కోసం కేసీఆర్‌ మీద బుర ద జల్లారు. కేసీఆర్‌ పకడ్బందీ వ్యూహంతో తెలంగాణ ఆకాంక్షను దేశ నాయకులకు వివరించగలిగారు. రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మృత్యువు నోట్లో తలపెట్టి లక్ష్యం సాధించారు. తెలంగాణ వికాసం కోసం కృషిసాగిస్తున్నారు.

రాష్ట్రం ఏర్పడగానే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అతివేగంగా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే అభివృద్ధి వేగం పుంజుకున్నది. ఇంతకాలంగా తెలంగాణ ఏం పోగొట్టుకున్నదో గుర్తించారు కాబట్టే సత్వరాభివృద్ధికి ప్రణాళికలు రచించారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ వ్యవస్థ కుప్పకూలిపోవడం గమనించారు కనుకనే గ్రామీణ విప్లవానికి నాందిపలికారు.వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే జరిగేదేమిటో పల్లె నుంచి వచ్చిన కేసీఆర్‌ కు తెలుసు. వ్యవసాయ భూమి ఉన్నా నీటి సౌక ర్యం లేకుంటే నిష్ప్రయోజనమే. అందుకే నీటి సౌకర్యం కల్గించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చా రు. ప్రజల ఆకలి తీర్చడానికి ఆరుగాలం కష్టపడే రైతుకు కేసీఆర్‌ అండగా నిలిచారు. కోటి ఎకరాలకు నీటివసతి కల్పించడం లక్ష్యంగా కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టును, అనుబంధ ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మింపజేశారు. ఢిల్లీ పార్టీలు, వలస పాలకుల పార్టీలు గత యాభై ఆరేండ్లలో నలభై లక్షల ఎకరాలకు కూడా నీరివ్వలేకపోయారు. పైగా ఉన్న చెరువులను దెబ్బతీశారు. కేసీఆర్‌ ఏడేండ్ల పాలనలో తెలంగాణను జలనిధిగా మార్చారు. కాళేశ్వరం, ఇతర అనుబంధ ప్రాజెక్టులతో తెలంగాణకు జలకళ వచ్చింది. చెరువులు, కుంటలు, ఎండకాలంలోనూ పొంగిపొర్లుతున్నాయి. గోదావరిలో ఎండకాలంలోనూ సముద్రాన్ని తలపిస్తూ నీళ్లు తళతళలాడుతున్నాయి. మిషన్‌కాకతీయ వల్ల చెరువుల్లో పూడిక తీయటంతో నీటి పరిమాణం పెరిగింది.

మిషన్‌ భగీరథతో తాగునీటి సమస్య తీరింది. సాగు నీటి ప్రాజెక్టులతో నీళ్ల సమస్య తీరింది. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుతున్నాయి. రైతుబంధు, ధాన్యం కొనుగోలు, మద్దతు ధర పెంపు, ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లాంటి పనుల వల్ల రైతు ముఖంలో ఆనందం కనిపిస్తున్నది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ లభిస్తున్నది. ఇంతటి అభివృద్ధి దేశంలో మరెక్కడైనా జరిగిందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుందని ఆంధ్రా పాలకవర్గాలు ప్రచారం చేశాయి. కానీ తెలంగాణ అస్తిత్వ పతాక వంటి హైదరాబాద్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారు. ఈ మహానగరం దేశానికే ఐటీ హబ్‌గా మారుతున్నది. చుట్టుపక్కల ఫార్మాహబ్‌లు నెలకొన్నాయి. మరోవైపు ఐటీ కంపెనీలు జిల్లాలకు కూడా విస్తరిస్తున్నాయి. హైదరాబాద్‌ను దేశంలోనే ఉత్తమ నివాసయోగ్య స్థలంగా, పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నారు. దేశానికే ఆదర్శప్రాయమైన సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. గురుకులాల ద్వారా పేద ప్రజల ఆత్మాభిమానాన్ని కాపాడుతున్నది కేసీఆర్‌ మాత్రమే. తెలంగాణకు కాకతీయుల నాటి వైభవం తీసుకురావడానికి ప్రాధాన్య క్రమంలో పథక రచన, అమలు జరుగుతున్నది. హరితహారంతో గ్రామాలు పచ్చదనమీనుతున్నా యి కాలుష్యం తగ్గి ప్రాణ వాయు వు పెరుగుతున్నది. ఢిల్లీ పార్టీలకు, ఆంధ్ర పార్టీలకు ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టే నాయకులను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. తెలంగాణ కోసమే కృషిచేసే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అని ప్రజలు గుర్తించారు.

ఉన్నత లక్ష్యం ముందు విద్వేషం ఓడిపోకతప్పదు. ఈటల బీజేపీలోకి పోవడం కూడా అలాంటిదే. బీసీ కార్డును ఉపయోగించుకొని ప్రయోజనం పొందాలని చూస్తున్న నాయకుడు తాను అధికారంలో ఉన్నప్పుడు బీసీగా చెలామణి అయ్యాడా? ఎవరికోసం పనిచేశాడనేది ప్రజలు గమనిస్తున్నారు. పోనీ తాను చేరబోతున్న పార్టీ బీసీలకు ఏమైనా చేసిందా? బీసీ రిజర్వేషన్లను ప్రతిపాదించిన మండల్‌ నివేదికను వ్యతిరేకించింది బీజేపీ కాదా? బీసీలకు ఉన్న రిజర్వేషన్లను తీసివేయడానికి ప్రయత్నిస్తున్న పార్టీ బీజేపీ. కానీ సబ్బండ వర్ణాలకు వృత్తిపరమైన ఆదాయ మార్గాలను పెంచుతూ అన్నిపార్టీల కంటే మెరుగైన రీతిలో బీసీలను ఆదుకుంటున్న పార్టీ టీఆర్‌ఎస్‌. సబ్బండవర్ణాల సమస్యలకు పరిష్కార వేదికగా ఉన్న ప్రగతిభవన్‌ను బానిసల భవన్‌ అంటూ విమర్శించిన ఈటల, మరి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు బానిసల్లా బతుకుతున్నరనే వాస్తవాన్ని గుర్తించడం లేదు. ఏ విధంగా చూసినా బీసీలు, మైనారిటీలు, దళితులు, ఎస్టీలకు బీజేపీకన్నా ఎన్నోరెట్లు మేలైన రీతిలో పథకాలను రచించి అమలు చేస్తున్నది టీఆర్‌ఎస్‌. 58 ఏండ్ల వలస పాలనను, ఢిల్లీ పెత్తనం వల్ల జరిగిన నష్టాన్ని అనతికాలంలోనే పూడుస్తూ తెలంగాణను ప్రగతిపథంలో పయనింప జేస్తున్న కేసీఆర్‌ను అడ్డుకోవడానికి బీజేపీ పంచన చేరడం ఈటల అవకాశవాద రాజకీయమే.

తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం కేసీఆర్‌ ఎంత కృషి చేస్తున్నారనేది పట్టించుకోకుండా విద్రోహులకు కొమ్ముకాయడం భావ్యం కాదు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలు, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన మరుసటిరోజు నుంచే విమర్శల దాడిని ప్రారంభించాయి. అయినా అన్ని విమర్శలను తిప్పికొడుతూ కేసీఆర్‌ రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకుపోతున్న టీఆర్‌ఎస్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌, బీజేపీ, కమ్యూనిస్టులు, టీడీపీ పనిచేయటం ఆ పార్టీల సహజ లక్షణమే.

-డాక్టర్‌ కాలువ మల్లయ్య