Home / SLIDER / మొక్క‌ల సంర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకోవాలి-మంత్రి ఎర్ర‌బెల్లి

మొక్క‌ల సంర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకోవాలి-మంత్రి ఎర్ర‌బెల్లి

ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని, మొక్క‌లు నాట‌డ‌మే కాకుండా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.శనివారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహిస్తున్న ముక్కోటి వృక్షార్చనలో భాగంగా దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామంలో మంత్రి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంద‌న్నారు. గ్రామాలు, పట్టణాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాయన్నారు. ఐటీ రంగంలో రాష్ట్రం ఎంతో ముందంజలో ఉందన్నారు. ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. గీసుకొండలో పెద్ద పరిశ్రమ ద్వారా లక్షలాది చేనేత కార్మికులు ఉపాధి పొందుతారన్నారు. కేటీఆర్ గత సంవత్సర పుట్టినరోజు సందర్భంగా ట్రస్ట్ ద్వారా ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ అందజేసినట్లు మంత్రి చెప్పారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లోభాగంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేర‌కు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. అన్ని గ్రామాల్లో మొక్కలు నాటడం ఒక ఉద్యమంలా సాగుతుందన్నారు. అనంతరం పాలకుర్తి మండల కేంద్రంలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వ‌ర్యంలో దివ్యాంగుల‌కు ట్రై మోటార్ సైకిళ్లను మంత్రి పంపిణీ చేశారు.

రూ. 85 వేలకు ఒకటి చొప్పున నియోజకవర్గంలో 105 మంది దివ్యాంగుల‌కు ట్రై మోటార్ సైకిళ్ళు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, డీఆర్డీవో జి. రాంరెడ్డి, జెడ్పీ సీఈవో ఎల్. విజయలక్ష్మి, డీపీవో కె. రంగాచారి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు