ప్రజలను సైక్లింగ్ వైపు మళ్లించి అటు పర్యావరణపరంగా, ఇటు ఆరోగ్యపరంగా మేలు కలిగేలా చైతన్యం తెచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్వహించిన ‘సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్’లో వరంగల్ నగరం విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా 11నగరాలకు ఈ టైటిల్ దక్కగా వాటిలో తెలంగాణ నుంచి వరంగల్ ఒక్కటే నిలిచి గెలిచింది. అన్నివర్గాలవారిని ‘సైక్లింగ్’లో ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేసి కేంద్రం నుంచి అవార్డుతోపాటు కోటి రూపాయల నజరానా అందుకునేలా చేసిన ‘జీడబ్ల్యూఎంసీ’పై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు.
పోటీలో విజయం సాధించేందుకు పాటుపడ్డ ‘స్మార్ట్ సిటీ’ బృందానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, అర్బన్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 107 నగరాలు పోటీ పడ్డాయి. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి నిర్వహణ తీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 11 నగరాలను గుర్తించింది.
ప్రాథమిక దశలో ఎంపికైన 25 నగరాల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఉండగా, తుది పోటీకి ఎంపికైన 11 నగరాల్లో ఒక్క వరంగల్ మాత్రమే నిలిచింది. విజేతలను అంతర్జాతీయ రవాణా నిపుణులతో కూడిన న్యాయ నిర్ణేతల కమిటీ ఎంపిక చేసింది. వరంగల్ నగరంలో అన్ని వర్గాల ప్రజలను సైకిల్ తొక్కేందుకు ప్రోత్సహించిన తీరు, కల్పించిన వసతులు, ప్రత్యేకంగా వేసిన సైకిల్ ట్రాక్, పార్కు, ప్రచార అంశాలను కమిటీ పరిశీలించి ఎంపికచేసింది.