పట్టుచీరె కట్టుకొని..
టిక్కీబొట్టు పెట్టుకొని..
వడ్డాణం సుట్టుకొని..
దిష్టిసుక్క దిద్దుకొని..
అందంగా ముస్తాబై..
కట్టుకోబోయేవాడి కోసం ఎదురుచూస్తుంది
ఒక అచ్చమైన పల్లెటూరి అమ్మాయి.
ఇన్నాళ్ల తన స్వేచ్ఛా ప్రపంచం గురించీ..
పెండ్లయ్యాక బతకాల్సిన
కొత్త ప్రపంచం గురించీ..
‘బుల్లెట్టు బండి మీద కూర్చొని చెప్తా రా’..
అంటూ పెండ్లికొడుకును పిలుస్తుంటే..
ఎంత ముచ్చటగా ఉంటుందో!
ఆ దృశ్యాన్ని చూపించే పాటే..
‘బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా’.
మోహన భోగరాజు స్వరం ఆ పాటకు వరమైంది. కమ్మనైన పాటలతో అందరినీ మెప్పిస్తున్న మోహన భోగరాజు పాట ముచ్చట..
‘ఫంక్షన్స్‌లో.. ఆటోల్లో.. కార్లలో.. ఎక్కడ చూసినా నీ పాటే ’ అని తెలిసినవాళ్లు ఫోన్‌చేసి చెప్తుంటే సంతోషంగా అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే పాట. అందుకే ఇంత ఆదరణ. ‘అవ్వసాటు ఆడపిల్లనయ్యో.. పిల్లనయ్యో ఆడ పిల్లనయ్యో.. నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో ప్రేమనయ్యో’ అంటూ తల్లిదండ్రులతో అనుబంధాన్ని.. ‘ఏడు గడపలల్ల ఒక్కదాన్నిరయ్యో.. దాన్నిరయ్యో ఒక్కదాన్నిరయ్యో.. మా అన్నదమ్ముల్లకు ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో’ అంటూ తోడబుట్టినవాళ్ల ప్రేమను నెమరేసుకునే అవకాశం కల్పించింది. నా మనసుకు, నా వ్యక్తిత్వానికి ‘బుల్లెట్టు బండి’ పాట దగ్గరగా ఉంటుంది.
ఎప్పటి నుంచో..
హైదరాబాద్‌లోనే కావడం వల్ల, సెలవుల్లో అమ్మమ్మవాళ్ల ఊరికి వెళ్లేదాన్ని. పచ్చని పంటపొలాలు, పక్షుల కిలకిలలు, నీటి గలగలలు నన్ను కట్టిపడేసేవి. నిజంగా, పల్లె జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనుషుల మధ్య ఆత్మీయతానురాగాలు గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా పల్లెవాసుల జీవనశైలి బాగుంటుంది. త్వరగా నిద్రలేస్తారు. త్వరగా పడుకుంటారు. ఇవన్నీ చూసిన నాకు ఊరంటే ఇష్టమేర్పడింది. గ్రామీణుల ఆత్మీయతలకు సంబంధించిన ఓ పాట పాడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా.
కట్టుకోబోయే వాడికోసం..
ఫోక్‌పై ఇష్టంతో బోనాల పాటలు పాడాను. నాకంటూ ఒక ప్లాట్‌ఫామ్ ఉండాలన్న ఉద్దేశంతో యూట్యూబ్ చానల్ ప్రారంభించా. చానల్‌లో నాలుగైదు మెలోడీస్ పెట్టాను. ఈసారి పక్కా ఫోక్ ‘బుల్లెట్టు బండి’ పాట అప్‌లోడ్ చేశాను. జానపదం నా ఆలోచనలకు దగ్గరగా ఉంటుంది. మిగతా పాటలు 99 శాతం ఇష్టమైతే.. ఫోక్ నాకు 100 శాతం ఇష్టం. పెండ్లీడుకొచ్చిన ఒక అమ్మాయి మనోభావాలను చెప్పాలని అనుకున్నాను. ఎక్కడ పుట్టింది? ఎలా పెరిగింది? ఎలాంటి వాతావరణంలో ఉండేది?.. అనే విషయాలను తాను పెండ్లి చేసుకునే అబ్బాయికి వివరించాలనే కాన్సెప్ట్ నాది. నేను అనుకున్నట్టుగానే రాశారు లక్ష్మణ్‌గారు. మొయినాబాద్ సమీపంలో తీశాం. వినయ్ షణ్ముఖ అద్భుతంగా తెరకెక్కించారు. పాటను ప్రొడ్యూస్ చేసిన ‘బ్లూ రాబిట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిరుప పటేల్, సామ్యుల్ హిట్ అవుతుందనే నమ్మకం కలిగించారు. బాజీగారి మ్యూజిక్, తరుణ్‌గారి కొరియోగ్రఫీ, మాధవిగారి కాస్ట్యూమ్స్.. అన్నీ కుదిరాయి. అందరికీ ఈ క్రెడిట్ దక్కుతుంది.
మూడో తరగతిలో గానసభ..
నాకు చిన్నప్పటి నుంచే పాటతో, సంగీతంతో అనుబంధం ఏర్పడింది. మా అమ్మ లక్ష్మి, నాన్న శివకుమార్. ఈ ఇద్దరి ప్రోత్సాహం ఉండటం వల్లే నేను ఈ రంగంలోకి వచ్చాను. నా బాల్యంలో అమ్మ మ్యూజిక్ నేర్చుకునేవారు. ఆ పాఠాలు వింటూ నేనూ పాడేదాన్ని. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా, త్యాగరాయ గానసభలో ఓ ప్రోగ్రామ్ నడుస్తున్నది. అమ్మ స్నేహితురాలు ‘మోహనను సబ్-జూనియర్ కేటగిరీలో పాడిద్దామా’ అని అడిగారు. అమ్మ ‘ఓకే’ చెప్పారు. అంత చిన్న వయసులో, అంత పెద్ద వేదికపై పాడటం ఎంత కష్టమో ఇప్పుడు అర్థం అవుతున్నది. అప్పట్లో ఇవేవీ తెలియదు. ఆ పోటీలో ఫస్ట్ ప్రైజ్ సంపాదించాను.
అమ్మమ్మ అందరికీ చెప్పేది
అమ్మకు నామీద నమ్మకం ఏర్పడింది. ఎక్కడ కాంపిటీషన్ ఉన్నా తీసుకెళ్లేవారు. మా అమ్మమ్మ కూడా నా పాటను బాగా ఇష్టపడేవారు. పెండ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలప్పుడు ‘మా మనవరాలు బాగా పాడుతుంది’ అని నా గురించి చెప్పేవారు. ‘ఇంత మంది బాగుందని అంటున్నారు. సినిమాలకు పాడితే ఇంకా బాగుంటుంది కదా?’ అనిపించింది. వయసు పెరుగుతున్న కొద్దీ పాట మీద ప్రేమ పెరుగుతూ వచ్చింది. పాటే జీవితమనే నిర్ణయానికొచ్చాను.
ఫోక్ వదలను
ఒకసారి ఓ పెద్ద కాంపిటీషన్‌కు వెళ్లాను. కార్యక్రమం తర్వాత, టాలెంట్ ఉన్న పదిమందికి ట్రెయినింగ్ ఇచ్చేందుకు నిర్వాహకులు ముందుకొచ్చారు. అక్కడే ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ గారు ఉదయ్‌కిరణ్ హీరోగా నటించిన ‘జై శ్రీరామ్’ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. సినిమాల్లో అదే నా మొదటి పాట. అప్పటికే ఇంజినీరింగ్, ఎంబీఏ పాసయ్యాను. ఉద్యోగం చేయాలా? మ్యూజిక్ ఫీల్డ్‌లో ఉండాలా? అనేది మాత్రం తేల్చుకోలేదు. చిన్నప్పటి నుంచీ పాటతో అనుబంధం ఉంది కాబట్టి, సినిమాలవైపు వెళ్లాలని ఆలోచిస్తున్న క్రమంలో.. రమ్యా బెహరాగారు ఒక రికార్డింగ్‌లో కలిశారు. అప్పటికే తాను కీరవాణి దగ్గర పని చేస్తున్నారు. ‘సీడీ చేసి ఇవ్వండి’ అని రమ్య చెప్పారు. వెంటనే ఇచ్చాను. ఆ పాట కీరవాణి గారికి నచ్చడంతో, ఆయన కాంపౌండ్‌లో చేరాను. మొదట్లో కోరస్‌లు పాడేదాన్ని. ‘బాహుబలి’తో నా కెరీర్ టర్న్ అయ్యింది. నాతో అయితే పాట పాడించారు కానీ, అది ‘బాహుబలి’కి అని తెలియదు. విడుదలయ్యాక తెలిసి చాలా సంతోషించాను. ఇప్పటివరకు 100కు పైగా పాటలు పాడాను. నేను పాడిన అన్ని పాటలకూ ఆదరణ లభించింది. ‘మనోహరి’ పాట సమయంలో నేను ఏ సామాజిక మాధ్యమాల్లోనూ లేను. నా ఫ్రెండ్స్ గూగుల్‌లో పని చేసేవారు. ‘మనోహరి పాట ఎవరు పాడారు?’ అని నీ గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండు’ అని వాళ్లే సలహా ఇచ్చారు. అలా నేను సామాజిక మాధ్యమాల్లోకి రావడంతో, ఆ పాట పాడింది నేనే అని అందరికీ తెలిసిపోయింది.
ఫోక్ వదలను
‘భలే భలే మగాడివోయ్’ కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ‘రెడ్డమ్మ తల్లి’ అయితే ఎప్పటికీ నిలిచిపోతుంది. ‘ఓ.. బేబీ’లో పాడిన పాటనూ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ‘వకీల్ సాబ్’లో ‘మగువా మగువా..’ బాగా ట్రెండ్ అయ్యింది. మావారు ప్రవీణ్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. ‘బుల్లెట్టు బండి’ లాంటి పాటలు మరిన్ని తీస్తూ నిత్యం ప్రజల హృదయాల్లో ఉండాలన్నదే నా లక్ష్యం.
బుల్లెట్టు బండి పాట ప్రారంభంలో కొద్దిగా స్లోగానే వెళ్లింది. అయితే అందరికీ నచ్చుతుందనే నమ్మకం నాకు ఉండేది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో బాగా చేశారు. పెద్దవాళ్లు, మిడిల్ ఏజ్ వాళ్లు, చిన్న పిల్లలు, అబ్బాయిలు.. అందరూ రీల్స్ చేశారు. కొంతమంది బుల్లెట్ వేసుకొని వీడియోలు చేశారు. ఇన్‌స్టాలో చూసిన ప్రతి ఒక్కరూ యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించారు. ఆ ఒరవడి ప్రారంభమైన తర్వాత, ఇక ఊపందుకుంది. అందరూ బాగుందని అన్నారు కాబట్టి, నాకు హ్యాపీగా అనిపించింది.
పెండ్లికాని అమ్మాయి తన భవిష్యత్‌ను.. పెండ్లయిన అమ్మాయి తన గతాన్ని.. అన్నదమ్ములు తమ అక్కాచెల్లెండ్లను.. తల్లిదండ్రులు తమ కూతురుని చూసుకునే అవకాశం నా పాట కల్పించింది. చిన్నపిల్లలు తమ పిన్నినో, మేనత్తనో చూసుకుంటారు. ఆటోలు, కార్లు, షాప్‌లు, ఫంక్షన్ హాళ్లు ఎక్కడ చూసినా ‘బుల్లెట్టు బండెక్కి..’పాటనే మార్మోగుతున్నది.
Source : Namasthe Telangana Zindagi