దళితబంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దళిత బంధును విజయం సాధించితీరుతది. నిన్ననే 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం. ఈ 75 ఏండ్లలో భారతదేశంలో ప్రధాని, పార్టీ కానీ దళిత కుటుంబాలను ఆదుకోవాలే, ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఎవరైనా మాట్లాడారా? కనీసం వాళ్ల మైండ్‌కైనా వచ్చిందా? ఆ దిశగా ఆలోచన చేసిండ్రా? చేయలేదు.
ఈ పథకం ఏడాది కిందనే మొదలుకావాలి. కానీ కరోనా వల్ల సంవత్సరం ఆలస్యమైంది. ఐదు రూపాయాలు కూడా ఇవ్వలేనోడు.. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతుండు. పక్కన బాంబులు పడ్డట్టు భయపడుతుండ్రు. దళితులు బాగుపడొద్దా. ఎవరెవరకి ఇస్తారో అని చెప్పాలంటుండ్రు. కుండబద్ధలు కొట్టి చెబుతాం, అందరికీ ఇస్తాం.
దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువతకు మనవి చేస్తున్నా. ఈ పథకాన్ని విజయవంతం చేసే బాధ్యత మీ మీదనే ఉంది’ అని సీఎం తెలిపారు.మొత్తం మంత్రివర్గం, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు వేదికపై ఉన్నారని, రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారుల తరపున నూటికి నూరు శాతం విజయవంతం చేస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.