Home / SLIDER / పాడి రైతులకు ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యం

పాడి రైతులకు ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయడం, పాడి రైతులకు ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యంగా విజయ మెగా డెయిరీని నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఏడాదిన్నరలోగా నిర్మాణం పూర్తిచేస్తామని, మెగా డెయిరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

శుక్రవారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.250 కోట్లతో తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించనున్న విజయ మెగా డెయిరీకి మంత్రి తలసాని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ డెయిరీలో సభ్యత్వం ఉన్న రైతులకు ప్రోత్సాహకాలు, బర్రెలు, ఆవుల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు అందజేస్తున్నట్టు గుర్తుచేశారు. పశువులు చనిపోతే 15 రోజుల్లోనే ఇన్సూరెన్స్‌ సొమ్ము చెల్లిస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్రం ఏర్పడే నాటికి మూతపడే స్థితిలో ఉన్న విజయ డెయిరీని సీఎం కేసీఆర్‌ తిరిగి నిలబెట్టారని పేర్కొన్నారు. నాడు అప్పుల్లో ఉన్న డెయిరీ నేడు రూ.700 కోట్ల టర్నోవర్‌ సాధిస్తున్నదని తెలిపారు. గతంలో లక్ష లీటర్లుగా ఉన్న రోజువారీ పాలసేకరణ సామర్థ్యం ప్రస్తుతం 4.5 లక్షల లీటర్ల స్థాయికి చేరిందని, దీనిని 8 లక్షల లీటర్లకు తీసుకెళ్తామన్నారు. మెగా డెయిరీ నిర్మాణంతో విజయ స్వరూపమే మారిపోతుందని, మరిన్ని ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొస్తామని చెప్పారు. పాడి రైతులకు అండగా నిలుస్తున్న విజయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు.