ధాన్యం కొనుగోళ్లకు గన్నీ బ్యాగుల కొరత ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు నిజం కావని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రస్తుతం 8.85 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండగా.. వాటిలో ఇప్పటివరకు కేవలం 2.5కోట్ల గన్నీ బ్యాగులు మాత్రమే వాడామని చెప్పారు. మిగిలిన 6.35కోట్ల బ్యాగులతో 25లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయొచ్చన్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
అసని తుపాను ప్రభావం నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి కమలాకర్ చర్చించారు. ధాన్యం సేకరణ సంతృప్తికరంగా సాగుతోందని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. పుకార్లు, గాలి మాటలను రైతులు నమ్మొద్దని ఆయన సూచించారు. తుపాను పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.