ప్రముఖ నటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారా? తెరవెనుక అలాంటి ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు తమిళనాడులో అలాంటి చర్చే నడుస్తోంది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవితో రజనీకాంత్ సమావేశమయ్యారు.
చెన్నైలోని రాజ్‌భవన్‌లో సుమారు అరగంటపాటు గవర్నర్‌తో ఆయన పలు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు రజనీకాంత్‌ను ప్రశ్నించగా ఆయన మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిసినట్లు చెప్పారు.
రాజకీయాలపైనా ఇద్దరమూ చర్చించుకున్నామని.. కానీ ఆ విషయాలు బయటకు చెప్పలేనని రజనీ తెలిపారు. భవిష్యత్‌లోనూ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని చెప్పారు. అనారోగ్య కారణాలతో రాజకీయ రంగ ప్రవేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లు గతంలో రజనీ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.