Home / EDITORIAL / జనాన్ని దోచి.. కుబేరులకు పంచి!

జనాన్ని దోచి.. కుబేరులకు పంచి!

అచ్చే దిన్‌, మోదీ హైతో ముమ్‌కీన్‌ హై అంటూ అధికారానికి వచ్చిన తరువాత మోదీ నిజంగానే పేదల కోసం పాటుపడ్డారా? లేక బడా వ్యాపారస్థుల కోసం పనిచేస్తున్నారా? అనే సందేహాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి.ఎన్నికల ముందు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అధికారానికి రావడానికి బీజేపీ పాలకులు అలవాటుపడ్డారు. కానీ, ప్రజల సంక్షేమం కోసం కృషి చేసి ఓట్లడిగే పరిస్థితి ఎప్పుడూ లేదు.

వాస్తవానికి మోదీ రెండు పర్యాయాల పరిపాలనలో పేదల బతుకులు దిగజారి పోయాయి.బడా వ్యాపారులకు మాత్రమే లబ్ధి చేకూరుతున్నది. ప్రజల సంక్షేమ పథకాలకు కత్తెర వేస్తూ, ఆశ్రిత వ్యాపారులకు పరమాన్నం వడ్డిస్తున్నారని గణాంకాలను పరిశీలిస్తే అతి సులభంగా అర్థమవుతుంది. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది అంటే కరోనా వల్ల అని సమర్థించు కోవచ్చు.కానీ,దేశాన్ని కరోనా కమ్మేయడానికి ముందే మోదీ పాలన ముంచేసింది.అది పేదల పాలిట శాపంగా పరిణమించింది.

ఫ్రెంచి రాజనీతి శాస్త్రవేత్త క్రిస్టోఫ జెఫెర్ లోట్ భారతదేశం- దక్షిణాసియా రాజకీయాలు ఆయన ప్రత్యేక అధ్యయనాంశం. ‘మోదీ’స్‌ ఇండియా’ – హిందు నేషనలిజమ్‌ అండ్‌ ది రైజ్‌ ఆఫ్‌ ఎథ్నిక్‌ డెమొక్రసీ’ అనే పుస్తకంలో మోదీ హయాంలో భారతదేశం అన్ని రంగాలలో ఏ విధంగా దిగజారి పోయిందీ ఆయన వివరించారు.సంపన్నులకు లబ్ధి చేకూర్చే మోదీ విధానాలతో పేదల పరిస్థితి మరింత భారమై పోయిందని సోదాహరణంగా వెల్లడించారు. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు క్లుప్తంగా…

వ్యవసాయానికి మొండిచెయ్యి

యూపీఏ హయాంలో వ్యవసాయానికి బడ్జెట్‌ పెరుగుదల 26 శాతం ఉంటే మోదీ పాలనలో 8.7 శాతానికి తగ్గింది.అంతేకాదు, ఒక్క 2016-17 ఆర్థిక సంవత్సరాన్ని మినహాయిస్తే, ఏ ఏడాది కూడా బడ్జెట్‌ కేటాయింపులకు అనుగుణంగా నిధులను వినియోగించలేదు.మరోవైపు,నిజ పెట్టుబడులు తగ్గుతూ ఉన్నాయి.పంట బీమా పథకం వల్ల రైతుల కన్నా మోదీ సన్నిహిత వ్యాపారి అనిల్‌ అంబానీ కంపెనీ ఎక్కువ లాభపడింది.వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరను వ్యయం కన్నా ఒకటిన్నర రెట్లు అధికంగా వచ్చేట్లు చేస్తానన్న మోదీ హామీ నెరవేరలేదు.వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడల్లా కేంద్రప్రభుత్వం దిగుమతులు జరిపి వాటి ధరలు తగ్గించింది.అధిక దిగుబడి ఉన్నప్పుడు ఎగుమతులకు అనుమతించడం లేదు.మార్కెట్‌లో రేట్లు మాత్రం పెరుగుతున్నాయి.

పెరిగిన గ్రామీణ పేదరికం

జాతీయ గణాంక కార్యాలయం సర్వే (2019) ప్రకారం- కుటుంబ వినియోగ వ్యయం మోదీ పాలనలో 3.7 శాతం తగ్గిపోయింది (2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో ఈ వ్యయం 13 శాతం పెరిగింది). సగటు కుటుంబ వినియోగ వ్యయం 2011-12లో రూ.1,501 ఉంటే 2017-18లో రూ.1,446కు పడిపోయింది. వాస్తవ లెక్కల ప్రకారం చూస్తే- 1972-73 నుంచి ఇంతగా ఎప్పుడూ పడిపోలేదు.

వినియోగ వ్యయం నగర ప్రాంతాల్లో రెండు శాతం పెరిగితే గ్రామీణ ప్రాంతంలో 8.8 శాతం తగ్గింది. దీనిని బట్టి మోదీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతం పట్ల చూపుతున్న వివక్ష తెలిసిపోతున్నది. ఆహారంపై చేసే సగటు వ్యయం 2011-12లో రూ.643 ఉంటే 2017- 18 నాటికి రూ.580కి క్షీణించింది. 2018-19 నాటికి గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాలలోనూ క్షీణత మొదలైంది. ప్రపంచ బ్యాంక్‌ హ్యూమన్‌ కాపిటల్‌ ఇండెక్స్‌ (2018) ర్యాంకింగ్‌ ప్రకారం అధ్యయనం చేపట్టిన మొత్తం 157 దేశాల్లో మన దేశం స్థానం 115. ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం మొత్తం 119 దేశాల్లో భారత్‌ స్థానం 103. జాతీయ పోషకాహార పర్యవేక్షణ బ్యూరో నివేదిక (2018) ప్రకారం 35 శాతం గ్రామీణ ప్రజలు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. 42 శాతం పిల్లలు తగినంత బరువు లేరు. 1970 దశకం నాటి కన్నా ఇది అధ్వాన్నమైన స్థితి. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ ర్యాంకింగ్‌ (2017) ప్రకారం మొత్తం 119 దేశాల్లో మన దేశం వందవ స్థానంలో ఉన్నది.

బడుగులకు నష్టం – అగ్ర కులాలకు మేలు

అట్టడుగు వర్గాలు మోదీ హయాంలో తీవ్రంగా నష్టపోయాయి. ఉన్నత వర్గాలకు లబ్ధి చేకూరింది. బడ్జెట్‌లో స్పెషల్‌ కాంపోనెంట్‌ ప్లాన్‌ కింద దళితులకు జనాభా ప్రకారం 16.6 శాతం కేటాయించాలి.కానీ మోదీ హయాంలో 9-6.5 శాతం మధ్య ఊగిస లాడింది.బడ్జెట్‌ కోత వల్ల స్కాలర్‌షిప్‌ నిధులు తగ్గాయి.దీనివల్ల 50 లక్షల మంది దళిత విద్యార్థులు నష్టపోయారు.పబ్లిక్‌ రంగాన్ని కుదించడం వల్ల రిజర్వేషన్‌ లేక బడుగు వర్గాలు నష్టపోయాయి. యూపీఎస్సీ ఉద్యోగ నియామకాలను కూడా మోదీ సర్కారు నలభై శాతం తగ్గించి వేసింది. నిపుణుల పేరుతో ప్రైవేటు రంగంలో వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ, అందులో రిజర్వేషన్‌ పాటించడం లేదు.మోదీ ప్రభుత్వం 2019లో ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్‌ను ప్రవేశ పెట్టింది. దీంతో సామాజిక వెనుకబాటుతనం కింద రిజర్వేషన్‌ అనే సైద్ధాంతిక ప్రాతిపదికను నీరుగార్చినట్టయింది. ఈ కోటా కింద అర్హతకు ఎనిమిది లక్షల రూపాయల వార్షికాదాయం నిర్ణయించడంతో దాదాపు అగ్రవర్ణాల వారిని అందరినీ రిజర్వేషన్‌కు అర్హులను చేసినట్టయింది.

రాజకీయ రంగంలో బీజేపీతోపాటు అగ్రకులాల ప్రాభవం పెరిగిపోయింది. ప్రత్యేకించి హిందీ ప్రాంతంలో ఈ వర్గాలకు చెందిన ఎంపీల సంఖ్య పెరిగింది. 2014లో బీజేపీకి చెందిన ఉన్నత కులాల ఎంపీల సంఖ్య 47.6 శాతం. ఇదే సమయంలో ఆ పార్టీలో బీసీ ఎంపీల సంఖ్య 20కు పడిపోయింది. బీజేపీలోని ఉన్నత కులాలలో కూడా బ్రాహ్మణులు, క్షత్రియుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. మండల్‌ అనంతర కాలంలో ఉన్నత వర్గాల సంఖ్య ఇంత ఎక్కువగా ఎన్నడూ లేదు. ఉన్నతవర్గాలు అధికులనే భావజాలాన్ని కూడా బీజేపీ పెంచుతున్నది.

ధనవంతుల ఆస్తుల పెరుగుదల

2014లో మోదీ అధికారం చేపట్టిన తరువాత ధనికులు మరింత ధనికులయ్యారు. పేదలు మరింత పేదలయ్యారు. ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోయాయి. ఆక్స్‌ఫామ్‌ ని వేదిక (2018) ప్రకారం, 77.4 శాతం దేశ సంపద పది శాతం అత్యంత ధనవంతుల వద్దకు చేరింది. 58 శాతం సంపద ఒక శాతం ధనికుల దగ్గరే ఉన్నది. 2017లో ముకేశ్‌ అంబానీ సంపద 67 శాతం పెరిగింది.

మోదీ అధికారంలోకి రాగానే సంపద పన్ను రద్దు చేశారు.కోటి రూపాయలు మించి ఆదాయం ఉన్నవారిపై ఆదాయపు పన్ను రెండు శాతం పెంచారు. ప్రత్యక్ష పన్నుల భారం సంపన్నులపై ఉంటుంది. కానీ సంపన్నులకు అదొక పెద్ద లెక్క కాదు, పరోక్ష పన్నులు విధిస్తే అందరిపై భారం పడుతుంది. పేదలపై భారం ఎక్కువగా ఉంటుంది. మోదీ ప్రత్యక్ష పన్నులకు బదులు పరోక్ష పన్నులు పెంచి పేదల వ్యతిరేకతను చాటుకున్నారు. పెట్రోలుపై పన్ను పెంచడం ఇటువంటిదే.

మోదీ ప్రభుత్వం 2015 బడ్జెట్‌ నుంచి కార్పొరేట్‌ టాక్స్‌ను తగ్గిస్తూ వచ్చింది. దీంతో పాటు విదేశీ, దేశీయ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల క్యాపిటల్‌ గెయిన్స్‌పై గతంలో పెంచిన సర్‌చార్జిని ఉపసంహరించుకున్నది. 2019- 20లో ప్రత్యక్ష పన్నులు 4.92 శాతం తగ్గాయి. సంపన్నులకు పన్నుభారం తగ్గించడం వల్ల ఏర్పడిన లోటును పూరించడానికి ప్రభుత్వం పరోక్ష పన్నును పెంచింది. దీంతో పేదలపై భారం పడింది. ఆదాయ వనరులు తగ్గడం, బడ్జెట్‌ లోటు వల్ల విద్య, ఆరోగ్యం వంటి సంక్షేమ రంగాలపై కోత పెట్టారు.పేదరిక నిర్మూలన పథకాలకు నిధులు తగ్గాయి.దీంతో అన్ని విధాలా పేదలు నష్టపోయారు. పేదరికం పెరిగి పోయింది.సంపన్నులు మరింత సంపన్నులు అయ్యారు.

బ్యాంకుల దోపిడీ- బడా వ్యాపారులకు వితరణ

బడా వ్యాపారులకు బ్యాంకుల సొమ్మును దోచిపెట్టే విధానం కాంగ్రెస్‌ హయాంలోనూ ఉన్నప్పటికీ, మోదీ పాలనలో తారాస్థాయికి చేరింది. 2018 మే నాటికి పబ్లిక్‌ రంగ బ్యాంకుల మొండి బకాయీలు 12.65 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. మొత్తం రుణాలలో మొండి బకాయీల వాటా 2012 మార్చిలో మూడు శాతం ఉంటే 2018 నాటికి 14 శాతానికి చేరింది. ఇదంతా బడా పెట్టుబడిదారీ సంస్థలు ఎగవేసిన రుణాలే. 2002 నుంచి మోదీకి మద్దతుదారుగా ఉన్న అదానీకి చెందిన గ్రూపు కూడా ఇందులో ఒకటి. 2015లో ఈ గ్రూపు ఓడ రేవును, రెండు విద్యుత్‌ కేంద్రాలను కొనుగోలు చేయడంతో రుణం 16 శాతానికి చేరింది. బ్యాంకింగ్‌ రంగం సంక్షోభంలో పడటంతో ఆర్‌బీఐ రుణాలు ఇవ్వటం నిలిపివేసింది. దీంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు రైతులు దెబ్బతింటున్నారు. ఎంతో మంది ఉపాధి కోల్పోతున్నారు. 2016 నాటి చట్టం- ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్ప్ట్రసీ కోడ్‌- ప్రకారం పారిశ్రామికవేత్తలు తమ ఆస్తులను అమ్మి రుణాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. కానీ వీరిపై చర్యలు తీసుకుని బ్యాంకులను కాపాడే చిత్తశుద్ధి మోదీ ప్రభుత్వానికి లేదు.

ఉపాధి హామీ ఉత్తదే

మోదీ నోరు తెరిస్తే చాలు పేదల కోసం పాటుపడు తున్నట్టు చెప్పుకొంటారు.కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి గ్రామీణుల, పేదల సంక్షేమ పథకాలు నిర్వీర్యమైపోయాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా ఈ గతి పట్టింది. మోదీ ఈ పథకానికి నిధులను క్రమంగా తగ్గించి వేశారు. ఈ పథకానికి నిధులు పంపిణీ చేయాలని 2016 మే నెలలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయినా, పంపిణీ చేయవద్దంటూ కేంద్రం గుట్టుగా ఆదేశాలను అధికారులకు జారీ చేసింది. ఫలితంగా, వంద రోజుల ఉపాధి పొందిన వారి సంఖ్య 2013-14లో 4,70,000 ఉండగా, 2014-15 నాటికే 2,50,000కు తగ్గిపోయింది. 2015-16 నాటికి 1,70,000 కు తగ్గిపోయింది. ఈ కూలీలందరి మొత్తం పనిదినాల సంఖ్య 2013-14లో 221.15 కోట్లు ఉండగా, 2014-15 నాటికి 166.32 కోట్లకు పడిపోయింది. సగటు కూలీ పనిదినాల సంఖ్య 2013-14లో 46 ఉండగా, 2014-15 నాటికి 39కి తగ్గిపోయింది. సగటు నిజ కూలీ రేటు 2014-15 నుంచి ఏడాది తిరిగే నాటికి రూ.142 నుంచి 136కు తగ్గింది. పలు రాష్ర్టాలలో కనీస వేతనం ఈ పథకం కన్నా ఎక్కువగా ఉన్నది.

స్వయం ప్రకటిత సంరక్షకులు

ప్రధాని మోదీ పాలనలో దేశవ్యాప్తంగా ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ర్టాలలో బజరంగ్‌ దళ్‌, గోరక్షక్‌ దళ్‌ మొదలైన పేర్లతో హింసాయుత మూకలు చెలరేగి పోవడం పరిపాటి అయింది. ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేమికులు కనిపిస్తే వారిపై దాడులు జరుపు తున్నాయి. గోరక్షణ పేర కొట్టి చంపిన ఉదంతాలున్నాయి.బీసీలు,దళితులు,మైనారిటీలపై వీరి దాడులు సాగుతున్నాయి.ఒకప్పుడు గుజరాత్‌లో జరిగిందే ఇప్పుడు మరింత దౌర్జన్యపూరితంగా ఉత్తరప్రదేశ్‌, హర్యానా తదితర రాష్ర్టాలలో జరుగుతున్నది. చాలా సందర్భాలలో పోలీసులు, నాయకులు వీరితో కుమ్మక్కవుతూ దాడులకు మద్దతు ఇస్తున్నారు. దౌర్జన్యానికి పాల్పడే మూకలు అధికారులను శాసిస్తున్నాయి. దీంతో బీజేపీ పాలిత రాష్ర్టాలలో చట్టబద్ధ పాలన లేకుండా పోయింది.పోలీసుల్లో,సైనిక దళాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌పరివార్‌కు చెందిన వారిని పెద్ద ఎత్తున నియమిస్తున్నారు.ఒకప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు తమ చేతికి మట్టి అంటకుండా బజరంగ్‌ దళ్‌ వంటి సంస్థలను వాడుకునేవారు.ఇప్పుడు ఈ మూకలకు చెందిన వారు బీజేపీలో పదవులు పొందుతున్నారు.పార్లమెంటులోకి ప్రవేశిస్తున్నారు, అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని చట్టుబండలు చేస్తూ సంఘ పరివార్‌ శక్తులు పోటీ ప్రభుత్వాలను నడుపుతున్నాయి.

మోదీ మొదటి హయాంలో ప్రభుత్వం నేరుగా కల్పించుకోకుండా ఈ దౌర్జన్యమూకలను ప్రోత్సహించింది.రెండవ పర్యాయం మోదీ అధికారానికి వచ్చిన తరువాత రాజ్యవ్యవస్థనే నిరంకుశంగా మార్చింది.లౌకికత్వాన్ని, బహుళ పార్టీ రాజకీయాన్ని సహించకుండా ప్రత్యర్థుల అణచివేతకు బీజేపీ పూనుకొంటున్నది. ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడం ద్వారా అధికారం చేపడుతున్నది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat