పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగడం మాత్రం హానికరమే అంటున్నారు పరిశోధకులు. దీనిలోని కెఫీన్ కారణంగా.. ఎసిడిటీలాంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మీద కూడా ఆ ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చే కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తికి ఈ అలవాటు అవరోధం కలిగిస్తుంది. దీంతో రోజంతా మగతగా అనిపిస్తుంది. నిస్సత్తువ ఆవహిస్తుంది.చాయ్ మనల్ని మరిన్నిసార్లు వాష్‌రూమ్ వైపు నడిపిస్తుంది.మూత్ర విసర్జన అధికం అవుతుంది. దీనివల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ మొదలవుతుంది.
కప్పులకొద్దీ చాయ్ తాగేవాళ్లు సహజంగానే మంచినీళ్లు ముట్టుకోరు. దీంతో ఒంట్లో నీటి నిల్వలు తగ్గిపోతాయి. ఇక్కడితో అయిపోలేదు.. టీలోని టానిన్స్ అనే రసాయనాలు.. ఒంట్లోని ఐరన్‌ను, క్యాల్షియంను మింగేస్తాయి. అలా పోషక విలువల కొరతకూడా వేధిస్తుంది. తేనీరులోని రసాయనాలు పళ్లమీది ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. దీంతో దంతాలరంగు మారిపోతుంది. అలా అని నిరాశపడాల్సిన పన్లేదు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నిర్భయంగా టీ తాగొచ్చు. రోజుకు రెండుసార్లు నిర్మొహమాటంగా పుచ్చుకోవచ్చు. అంతకుమించి .. కప్పులు పెరిగేకొద్దీ తిప్పలే.