గుజరాత్ దేశానికే రోల్ మాడల్‌గా నిలిచిందంటూ ఊదరగొట్టే బీజేపీ నేతల మాటలన్నీ కల్పితాలేనని మరోసారి రుజువైంది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని పిల్లల్లో పోషకాహారలోపం చాలా ఎక్కువగా ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 తాజా గణాంకాల్లో వెల్లడైంది. ఐదేండ్లలోపు మొత్తం చిన్నారుల్లో 9.7 శాతం కంటే ఎక్కువ మంది తక్కువ బరువుతో ఉన్నట్టు తేలింది.
వయసుకు తగిన ఎత్తు లేని చిన్నారుల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో, శారీరక బలహీనత కలిగిన చిన్నారుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నది. గుజరాత్‌లోని 30 జిల్లాల్లో 1,25,707 మంది చిన్నారులు పోషకాహారలోపంతో బాధపడుతున్నట్టు గతేడాది రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీకి వివరించింది. అహ్మదాబాద్, సూరత్, వడోదరా, రాజ్‌కోట్‌లో పోషకాహారలోపం ఉన్న పిల్లల సంఖ్య పెరుగుతున్నట్టు తెలిసింది.