తెలంగాణ రాజకీయవర్గాల్లో అతి పెద్ద సంచలనం చోటు చేసుకోబోతుంది… కాంగ్రెస్ పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ షాక్ ఇవ్వబోతున్నారని, త్వరలో బీఆర్ఎస్ లో చేరడం ఖాయమని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సీనియర్లకు మధ్య గత కొన్నాళ్లుగా తీవ్ర విబేధాలు చోటు చేసుకున్నాయి. తన సీఎం సీటుకు పోటీ రాకుండా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సీనియర్లను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడన్నది బహిరంగ సత్యం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి,, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, వీహెచ్, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ వంటి సీనియర్లకు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కోల్డ్ వార్ నడుస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి సీనియర్లు ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా తన భార్య కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డితో సహా బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక తమ పార్టీ అగ్రనేత అనుచరుల హస్తం ఉందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు కూడా చేశారు. రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే విషయమై సమాలోచన చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు హ్యాట్రిక్ కొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సీనియర్లను వరుసగా కారెక్కించి రేవంత్ రెడ్డి అండ్ కో కు గట్టి షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఉత్తమ్ దంపతులకు ఆహ్వానం పలికినట్లు, హుజూర్ నగర్, కోదాడ టికెట్లు వారిద్దరికి కన్ఫర్మ్ చేసినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు అధిష్టానం నుంచి ఉత్తమ్ దంపతుల చేరికపై సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మల్లయ్య యాదవ్ కు ఎమ్మెల్సీ కానీ, పార్టీలో ముఖ్య పదవి కానీ ఇస్తామని, తన భవిష్యత్తు తనకు వదిలేయమని బీఆర్ఎస్ బాస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 18 న లేదా…ఈ నెల 20 న సూర్యాపేట పర్యటనలో ఉత్తమ్ దంపతులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గులాబీ కండువాలు కప్పుకునే అవకాశాలు ఉన్నాయని టాక్. అయితే ఉత్తమ్ దంపతుల చేరికను కాంగ్రెస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి..కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తొలుత ఉత్తమ్ దంపతులు, ఆ తర్వాత మెదక్ జిల్లాలో జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ వంటి కాంగ్రెస్ సీనియర్లు సైతం కారెక్కడం ఖాయమని రాజకీయ, మీడియా వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది. ఉత్తమ్ దంపతులు వీడితే మాత్రం ఆయన బాటలో కాంగ్రెస్ సీనియర్లంతా గులాబీ గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా కావాల్సిందే.. కానీ బలమైన సీనియర్లు వెళ్లిపోతే క్యాడర్ బలహీనపడి కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ ఖాయమనే చెప్పాలి. మరి ఉత్తమ్ దంపతులు కారెక్కుతారో లేదో తెలియాలంటే మరో రెండు, మూడు రోజులు ఆగాల్సిందే.