ఏపీ సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనే ధ్యేయంగా దూసుకుపోతున్నారు. కాగా ఇప్పటికే తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న ఆయన ఉద్యోగులకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని మరోసారి నిరూపించారు. ఈ మేరకు తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల నేపద్యంలో తాజాగా మరోసారి కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురు ప్రకటించారు. సీఎం నిర్ణయంతో ఇప్పుడు అదనంగా మరో 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి లబ్ది చేకూరడం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా జగన్ సర్కారు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఐదేళ్ల నిబంధన తొలగించనుంది. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ప్రభుత్వం రెగ్యులర్ చేయనుంది. కొద్దిరోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన అని అధికారులు స్పష్టం చేశారు. సీఎం నిర్ణయంతో అదనంగా మరో 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి లబ్ది కలగనుందని ఏపీజీఈఏ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
అదే విధంగా విద్యుత్ శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ద్వారా 27 వేల మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా సీఎం జగన్ సూచనలతో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు ఆయన తెలిపారు. దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం రూ.21 వేలు దాటింది. అలాగే, గ్రూప్ ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలను కూడా ఆదేశించింది.