మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఆలగడప మండలంలోని అన్ని గ్రామాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు గడపగడపకూ తలుపుతడుతున్నాయని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని, సుపరిపాలనను ఆకాంక్షించే ఓటర్లంతా కారు గుర్తుకే ఓటేయ్యాలని, బీఆర్ఎస్ కే ఓటేయ్యాలని ఆయన అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఆలగడప మండలంలోని గ్రామాల్లో భాస్కర్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరెంట్ విషయంలో కర్ణాటక గోస తెలంగాణకు అవసరమా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటే దిక్కు అవుతుందని పేర్కొన్నారు.
ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎవర్నీ ఓన్ చేసుకోలేదు. అందరు నాయకులను దూరం చేసుకుంది. బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సమస్యలన్నీ తొలగిపోయాయి. ఎస్సార్ఎస్పీకి పునరుజ్జీవం పోసిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇవాళ వరద కాలువ సజీవంగా మారిందంటే కాళేశ్వరం వల్లనే. 50 ఏండ్లుగా ఏమీ చేయలేని కాంగ్రెస్ మళ్లీ ఒక్క ఛాన్స్ అంటోంది అని భాస్కర్ రావు మండిపడ్డారు. కర్ణాటకలో కరెంట్ లేకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని కర్ణాటక ప్రజలు చెంపలేసుకుంటున్నారు. మొసళ్లను తీసుకెళ్ళి సబ్ స్టేషన్‌లో వదిలిపెట్టారు అక్కడి రైతులు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు.
పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే 3 గంటల కరెంటే దిక్కు. రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్ సమస్యను పరిష్కరించుకున్నామని భాస్కర్ రావు తెలిపారు. తెలంగాణ అన్నదాతల సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ కే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న రైతు సంక్షేమ పథకాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. రైతులు వేసే పంటకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని భాస్కర్ రావు అభివర్ణించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అన్నదాతలు అరిగోస పడుతున్నారని విమర్శించారు.
అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ సర్కార్ ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని భాస్కర్ రావు అభ్యర్థించారు. వచ్చేనెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు నమోదు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని భాస్కర్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సైదులు యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్థ, తదితరులు పాల్గొన్నారు.