ఖమ్మం తెలంగాణ భవన్ లో మంత్రి అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నాగేశ్వరరావులతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఎంపీ రవిచంద్ర తెలంగాణ రాష్ట్ర సాకారంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల సహకారం ఏ మాత్రం లేదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఖమ్మం తెలంగాణ భవన్ లో శనివారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,వారిద్దరి పేర్లు ప్రస్తావించకుండానే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మహానేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చాకే ఆ నాయకులిద్దరు పార్టీలో చేరారన్నారు.ఒకాయన ఓటమి పాలై ఇంట్లో కూర్చుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు.పార్టీని, అధికారాన్ని ఉపయోగించుకుని బాగుపడిన ఆ నాయకులు ద్రోహం తలపెట్టి ఫిరాయించారని ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు.నిజంగా మీకు ప్రజలలో పలుకుబడి,సత్తా ఉన్న పక్షంలో ఈ ఎన్నికలలో స్వతంత్రులుగా నిలబడి గెలవాల్సిందిగా సవాల్ విసిరారు.
మహనీయులు కేసీఆర్ అద్భుతమైన మేనిఫెస్టోను ప్రకటించారని,ప్రజల సంపూర్ణ మద్దతుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది సీట్లు గెలుచుకోవడంతో పాటు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమని ఎంపీ వద్దిరాజు ధీమాగా చెప్పారు.ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, పార్టీ వైరా, మధిర,పాలేరు నియోజకవర్గాల అభ్యర్థులు బానోతు మదన్ లాల్, లింగాల కమల్ రాజు,కందాల ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గం సమన్వయ కర్త గుండాల కృష్ణ (ఆర్జేసీ), రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు మాట్లాడారు.