ముథోల్ బాసర సరస్వతి దేవి కొలువైన ఈ పుణ్యభూమికి శిరస్సు వంచి నమసరిస్తున్నాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ముథోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అభ్యర్థి విఠల్ రెడ్డికి మద్దతుగా కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణలో గతంలో ఎప్పుడూ కూడా గోదావరి పుష్కరాలు జరగలేదు అని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పుష్కరాలు జరుపుకుంటున్నాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. బాసర ఆలయం అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేశాం. ఆ పనులు జరుగుతున్నాయి. ఇంకా అవసరమతై మరిన్ని నిధులు మంజూరు చేస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
బీడీ కార్మికులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. దేశంలో 19 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో పెన్షన్ లేదు. మన దగ్గరనే బీడీ కార్మికులకు పెన్షన్ ఉంది. పెన్షన్లు పెంచుతాం. కొత్తవారికి కూడా ఇస్తాం. బీడీ కార్మికులకు కాదు.. టేకేదార్లు, ప్యాకింగ్ చేసేవారికి మంజూరు చేశాం. అందరికీ సహాయం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే తెలంగాణ ముందుకు పోతది. దయచేసి బీఆర్ఎస్‌ను గెలిపించి విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.