
ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల నాయకుడు.. ఆయన ఇంటి నిండా ఎప్పుడు చూసినా ప్రజలే ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల పనులు చేసిపెట్టే ప్రజా నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఎన్నికలు రాగానే ఆగమాగం కాకుండా.. ఈ పదేండ్ల బీఆర్ఎస్ పాలనను, 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనను బేరిజు వేసుకుని, ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతుంది. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణితి రాలేదు. ప్రజాస్వామ్య పరిణితి చెందిన దేశాలు ముందుకు దూసుకుపోతున్నాయి. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.
ఆలోచన చేయాలి. మంచేదో చెడేదో గుర్తించాలి. ప్రజలు గెలిచినప్పుడే వారి ఆకాంక్షలు నెరవేరుతాయి అని కేసీఆర్ అన్నారు.ఈ రోజు బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన తర్వాత మీ ఆశీర్వాదంతో ప్రభుత్వానికి వచ్చి పదేండ్ల నుంచి పరిపాలన చేస్తున్నాం. ఈ పదేండ్లలో ఏం జరిగింది..? 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది..? అనేది బేరీజు వేయాలి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో నిధులు, నీళ్లు లేవు. కరెంట్ లేదు. రైతులు, చైనేతల ఆత్మహత్యలు. వలసలు పోవుడు. చాలా భయంకరమైన బాధలు. మూడు నాలుగు నెలలు మెదడు కరగదీసి, ఒక ప్రణాళిక వేసుకున్నాం. చెట్టు ఒకడు, గుట్టకు ఒకడు ఉన్నాడు. ఇవన్నీ గమనించి పేదల సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నాం కేసీఆర్ తెలిపారు.