తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తిరిగి టికెట్లు ఇవ్వడం బీఆర్‌ఎస్‌లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని, దానిని సానుకూలంగా మలుచు కోవాలని కాంగ్రెస్, బీజేపీ భావించగా.. వారి అంచనాలు తారుమారు అయ్యాయి.
మరోవైపు కాంగ్రెస్, బీజేపీలో అభ్యర్థుల ఎంపిక గొడవలు తారస్థాయికి చేరుకొన్నాయి. పార్టీ టికెట్లు అమ్ము కున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కీలక నేతలు ఆ పార్టీని వీడారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, పీ విష్ణువర్ధన్ రెడ్డి, సంగిశెట్టి జగదీశ్వర్, కురవ విజయకుమార్, మానవతారాయ్, గాలి విజయకుమార్ తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు.
టికెట్ ఆశించి భంగపడిన జంగా రాఘవరెడ్డి, కాసుల బాల్‌రాజ్, బెల్లయ్యనాయక్ వంటి 25 మంది నేతలు ఆయా నియోజక వర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. మరోవైపు డిపాజిట్లు కూడా రాని పాతబస్తీ సీట్లను అంట గట్టడంతో బీసీ నేతలు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాగా, పోటీ చేసేందుకు బీజేపీ నేతలు జంకుతున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మురళీధర్‌రావు లాంటి ముఖ్యనేతలంతా పోటీకి నిరాకరించారు. ప్రధాని మోదీ రెండు సభలు నిర్వహించినా స్పందన లేకపోవడంతో కమలం పూర్తిగా డీలా పడిపోయింది.