సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ను శుక్రవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యిందని మంత్రి హరీశ్ రావు గారు చెప్పారు. రైతుల తలరాత మార్చే.. తరతరాలు ఉండే గొప్ప ప్రాజెక్టు ఇది. అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్ల ముందు జరిగిందని ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు తన సంబురాన్ని వెలిబుచ్చారు.
ఈ మేరకు ఎన్ని టీఏంసీల నీళ్లు వచ్చాయని, ఎన్ని మీటర్ల ఎత్తు వరకూ వచ్చాయో.. ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆరా తీయగా.. 11 టీఏంసీల మేర నీళ్లు వచ్చాయని, 30 మీటర్ల ఎత్తు వరకూ పైకి నీళ్లు వచ్చాయని, బండ్ మొత్తం 22 కిలో మీటర్లు ఉండగా., దాదాపు 20 కిలో మీటర్ల మేర నీళ్లు చేరినట్లు ఇరిగేషన్ డీఈ సుమన్, జేఈ భరత్ లు మంత్రికి వివరించారు.
ఈ విషయమై అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులతో ఎప్పటికీ నిలిచిపోయే గొప్పపనిని అనతి కాలంలోనే పూర్తి చేసుకున్నామని గత అనుభవాలను గుర్తు చేశారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బక్కి వెంకటయ్య, తొగుట స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.