ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకనిర్ణయం ప్రకటించారు. కౌలురైతులకు వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వ పెట్టుబడిసాయం అందనుందని స్పష్టం చేశారు. తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపుకార్యాలయంలో జగన్ అగ్రికల్చర్ మిషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కౌలురైతులకు రైతు భరోసా వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. రాబోయే సీజన్ కు విత్తన సరఫరాకు సరైన ప్రణాళికలు రూపొందించాలని జగన్ ఆదేశించారు. మేనిఫెస్టోలో రైతులకిచ్చిన హామీలన్నీ రైతు దినోత్సవం రోజున ప్రకటించనున్నట్లు జగన్ తెలిపారు. రైతు భరోసాలో ఇచ్చిన 12హామీలను జూలై8 నుంచి రైతు దినోత్సవం సందర్భంగా అమలు చేయనునన్నట్లు ప్రకటించారు. ప్రతీనెల అగ్రికల్చరర్ మిషన్ సమావేశం ఉంటుందని అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైతులకు 9గంటలపాటు నాణ్యమైన పగలు కరెంట్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా 60శాతం ఫీడర్‌ల ఆధునీకరణ కోసం రూ.1700కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉండకూడదని ఆదేశించారు. కౌలు రైతులకు రైతు భరోసా అమలుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అవసరమైతే అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తామన్నారు. భూ రికార్డుల సవరణ కూడా చేపడతామన్నారు. రైతు సహకార సంఘాల ఎన్నికలు, నీటి సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం నామినేట్ చేసిన వ్యక్తులే రైతు సహకార సంఘాలుగా నీటి సంఘాల సభ్యులుగా కొనసాగుతున్నారని వాటిని రద్దుచేసినా వారే కొనసాగుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై సీరియస్ అయిన సీఎం వారందరినీ సీఎం తొలగించాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.