తాజాగా ఏపీ ప్రభుత్వంపై టీడీపీ పెద్దఎత్తున విమర్శించేందుకు ప్రయత్నించిన ఘటన రాజధాని ప్రాంతంలోని వరదలు.. వరదల సమయంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేదనేది వారి విమర్శ. అయితే వరదల కారణంగా పంటలు పోయినచోట మళ్లీ పంటలు వేసుకునేలా ప్రోత్సాహిస్తామని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మినుములు, పెసల విత్తనాలు కూడా సబ్బిడీపై ఇస్తామన్నారు. అలాగే వరదలపై తాజా పరిస్థితిని అంచనా వేయడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు లంక గ్రామాలు, రాజధాని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మునిగిన పంటలను పరిశీలించి వల్లూరుపాలెం పునరావాసకేంద్రంలో బాధితులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో సహాయకచర్యలు చర్యలు చేపట్టామని, అన్నివిధాలా అండగా ఉంటామన్నారు. వరద పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకూ బాధితులను పునరావాస కేంద్రాల్లోనే ఉంచి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అంటువ్యాధులు ప్రభలకుండా శానిటేషన్ పై దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే సీఎం కూడా వరదల కారణంగా నష్టపోయిన బాధితులను గుర్తించి పూర్తిస్థాయి నష్టం అంచనాలు లెక్కించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరగా నివేదికలు ఇవ్వాలని స్పష్టంచేశారు. అయినా టీడీపీ దుష్ప్రచారం ఏమాత్రం తగ్గించలేదు.. ఈ క్రమంలోనే వరద సహాయక చర్యల పై ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారానికి ఓ ఫొటో ఉదాహరణగా నిలిచింది. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో వరద బాధితుల కోసం ఏర్పాటుచేసిన భోజనాన్ని తింటున్న స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఫొటో బయటకు రావడంతో తెలుగుదేశం చేస్తున్నది దుష్ప్రచారం అని తేలిపోయింది.
