పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మరోమారు తెలంగాణ రాష్ట్రం వైపు దేశం చూపుపడింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎన్నికలో టీఆర్ఎస్ ఓటు కీలకం అవుతుండటం, గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇటీవల డిప్యూటీ చైర్మన్ కురియన్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానం భర్తీ చేసేందుకు ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటు కీలకం కానుంది.
మొత్తం 245 సీట్లు ఉన్న రాజ్యసభలో ఆయా పార్టీ/ కూటమి నిలబెట్టిన అభ్యర్థి విజయానికి 122 ఓట్లు కావాలి. అతిపెద్ద పార్టీ బీజేపీకి 67 సీట్లు మాత్రమే ఉన్నాయి. మిత్రపక్షాలు, 14 మంది అన్నాడీఎంకే ఎంపీలతో కలిపి బీజేపీకి 104 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇక విపక్షాల విషయానికొస్తే కాంగ్రెస్ కు 51 మంది ఎంపీలు ఉన్నారు. ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన టీడీపీ ఎంపీలతో కలుపుకొని విపక్షాల బలం 115కి చేరింది. దీంతో అందరి దృష్టి 9 మంది ఎంపీలున్న బీజేడీ, ఆరుగురు టీఆర్ఎస్ ఎంపీలు, ఇద్దరు వైసీపీ సభ్యులపైనే నిలిచింది. వీరు ఎటు మొగ్గితే ఆ అభ్యర్థి గెలుస్తారు. అయితే వైసీపీ తాను బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. టీఆర్ఎస్ ఎటు మొగ్గుతుందనేది అందరికీ సస్పెన్స్ గా ఉంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను నెరవేరిస్తే బయటి నుంచి మద్దతివ్వడం ఒక మార్గంగా కనిపిస్తోంది. లేకపోతే ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం తన ముందున్న ప్రత్యామ్నాయాలను వచ్చే వారం పార్టీ ఎంపీలతో చర్చించి కేసీఆర్ తన నిర్ణయం ప్రకటించవచ్చని తెలుస్తోంది. వ్యూహరచనలో నిపుణుడైన గులాబీ బాస్ కేసీఆర్ ఆలోచనేంటో రాజకీయ పార్టీల నేతలకు అంతుచిక్కకపోవడం గమనార్హం.