తెలంగాణ జనసమితి నేత, మాజీ ప్రొఫెసర్ కోదండరాం క్రాస్‌రోడ్స్‌లో ఉన్నారా? టీఆర్ఎస్ వ్యతిరేక అజెండాతో ముందుకు సాగుతున్న ఆయన్ను కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే వదిలేసి బక్రాను చేయనుందా? త్వరలో ఇందుకు తగిన కార్యాచరణను అమల్లో పెట్టనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలో టీడీపీ-తెలంగాణ జనసమితి కలిసి కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఇంకా సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్‌లో కాంగ్రెస్ సహా మహాకూటమి నేతలు సుమారు మూడుగంటల పాటు సమావేశమై సీట్ల సర్దుబాటు చర్చలు జరిపారు. కాంగ్రెస్ తరఫున రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సి కుంటియా, భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం తరఫున ఎల్ రమణ, సిపిఐ తరఫున చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జన సమితి తరఫున కోదండరాం హాజరై సుమారు మూడు గంటలకు పైగా సీట్ల సంఖ్య, స్థానాల ఖరారు తదితర పలు అంశాలపై చర్చించారు.దీనికి కొనసాగింపుగా రాష్ట్ర పర్యటనకు రాహుల్‌గాంధీ శనివారం రానున్న నేపథ్యంలో మహాకూటమి భాగస్వామ్య పక్షాల్లోని టీడీపీ, సీపీఐ నాయకులు భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే, కాంగ్రెస్ సొంత కార్యక్రమానికి వస్తున్న రాహుల్ గాంధీని కలవబోమని టీజెఎస్ నేత కోదండరాం స్పష్టం చేశారు.
ఇప్పటివరకు సీట్ల విషయంలో స్పష్టత రాకపోయినప్పటికీ రెండు మూడు రోజుల్లో కొలిక్కి వస్తుందని కూటమి నేతలు భరోసాగా ఉన్న నేపథ్యంలో….కోదండరాం ఇచ్చిన ట్విస్ట్‌తో కాంగ్రెస్ నేతలు షాక్‌కు లోనయ్యారని సమాచారం. ముందగా సీట్లపై పేచీ, అనంతరం గుర్తుపై నో చెప్పడం, తదుపరి ఇలా పీటహుడి పెడుతున్న నేపథ్యంలో కోదండరాంతో సంబంధం లేకుండా ఎన్నికలకు వెళ్లాలని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వచ్చేవారంలో నిర్ణయం ఉంటుందని అంటున్నారు. తద్వారా ఇటు సొంతంగా బలపడలేక అటు కాంగ్రెస్‌తో ముందుకు సాగలేక కోదండరాం గందరగోళంలో పడిపోవడం ఖాయమని అంటున్నారు.