Home / 18+ / తెలుగు రాష్ర్టాలకు కాంగ్రెస్, బీజేపీలు తీరని నష్టాన్ని చేస్తున్నాయి…కేటీఆర్

తెలుగు రాష్ర్టాలకు కాంగ్రెస్, బీజేపీలు తీరని నష్టాన్ని చేస్తున్నాయి…కేటీఆర్

నాలుగున్నరేండ్లలో కారు వేగం బాగుందని, సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా డ్రైవర్ ఏకాగ్రతతో కారు నడుపుతున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ సమయంలో ప్రజలు కారులో డీజిల్ పోసి వేగం ఆగకుండా చూడాలని కోరారు. కారు ఆగొద్దు.. డ్రైవర్ మారొద్దు అని పిలుపునిచ్చారు. సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో అగర్వాల్, జైన్, మహేశ్వరీలకు చెందిన వివిధ మార్వాడీ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మరోవైపు హైదరాబాద్‌లోని కూకట్‌పలి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల ప్రజలతో నిజాంపేటలో నిర్వహించిన మన హైదరాబాద్-మనందరి హైదరాబాద్ కార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్ అభ్యర్థులు అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందతో కలిసి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాలకు కాంగ్రెస్, బీజేపీలు తీరని నష్టాన్ని చేస్తున్నాయని విమర్శించారు. డ్బ్బై ఏండ్లలో దేశానికి కాంగ్రెస్ పార్టీ మొండి చెయ్యి చూపిందని, ప్రతి ఒక్కరి నెత్తిపై భస్మాసుర హస్తం పెట్టి దేశాన్ని ఆగమాగం చేసిందని మండిపడ్డారు. ఇక దేశంలో అందరి చెవుల్లో పువ్వు పెట్టింది బీజేపీనని విమర్శించారు. రాష్ర్టానికి లక్షల కోట్లు ఇచ్చామన్న అమిత్‌షా వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. మేం ఇచ్చేవాళ్ల.. మీరు పుచ్చుకునేవారని మాట్లాడడం తగదు. అమిత్‌షా ఏమైనా తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను అమ్మి తెలంగాణకు నిధులిచ్చారా? అసలు రాష్ర్టాల నుంచి పన్నులు కట్టకుంటే కేంద్రం నిధులు ఎలా ఇస్తుంది? రాష్ర్టాలు లేకుంటే కేంద్రం అనేది ఒక మిథ్య.

అహంకారపూరిత ధోరణి ఉన్న కాంగ్రెస్, బీజేపీలను తెలుగు ప్రజలు తిప్పికొట్టాలి. స్థానిక ప్రాంతీయ పార్టీలను ఎన్నుకోవాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది ఒకటే వైఖరి. వారికి బాసులు ఢిల్లీలో ఉంటారు. ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల సీఎంలపై, ప్రజల ఆకాంక్షలపై ఆ పార్టీలు చిన్నచూపు చూస్తాయి. ఢిల్లీలో కొందరు అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారు. ఈ పరిస్థితులు పోవాలంటే ప్రాంతీయ పార్టీలు బలపడాలి. వాటితోనే అభివృద్ధి సాధ్యం అని కేటీఆర్ స్పష్టంచేశారు. ఏపీలోగానీ ఇతర రాష్ర్టాల ఎన్నికల్లోగానీ జాతీయ పార్టీలకు అడ్రస్‌లేకుండా చేయాలని అన్నారు.

 

బీజేపీ 21 రాష్ట్రాల్లో ఉన్నదని చెప్పుకొనే అమిత్‌షా.. సీఎం కేసీఆర్‌లా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలని, 24 గంటల నిరంతర విద్యుత్, మిషన్ కాకతీయ పథకాలు అమలుచేసి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. అమరావతిలో కొత్త రాజధాని ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ తోటి పక్క రాష్ట్రం అభివృద్ధిని కాంక్షించి రాష్ట్రం తరఫున అమరావతికి రూ.100 కోట్లు ఇద్దామని తొలుత భావించారని కానీ, ప్రధాని మోదీ తట్టెడు మట్టి, చెంబడు నీళ్లతో సరిపుచ్చడంతో కేవలం శుభాకాంక్షలు తెలిపి మౌనంగా వచ్చారని కేటీఆర్ వివరించారు. అక్కడ హర్షాధ్వానాల నడుమ కేసీఆర్‌ను స్వాగతించిన తీరు మరచిపోలేదని ఆయన గుర్తుచేశారు.