వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ విజయకేతనం ఎగురవేశారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రపై ప్రతిరౌండ్‌లో ఆధిక్యత సాధించారు. బీజేపీ అభ్యర్థి కుసుమ సతీశ్ డిపాజిట్ గల్లంతు అయింది. మహా కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీజేఎస్ అభ్యర్థి ప్రభావం ఎక్కడా కనిపించలేదు. కనీసం ఏ రౌండ్‌లోనూ ఆయన మూడంకెల ఓట్లు సాధించలేకపోయారు. స్వతంత్ర అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోయారు.అన్ని బూత్‌ల లో, ప్రతి రౌండ్‌లో నన్నపునేని నరేందర్ తన ఆధిపత్యాన్ని కనబర్చారు. నరేందర్‌కు 83,922 ఓట్లు రాగా, ఒద్దిరాజు రవిచంద్రకు 55,140 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కు సుమ సతీష్‌కు 4729 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి రవిచంద్రపై 28,782 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రతి రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ తన ఆధిక్యతను చాటుకున్నారు. తొలి రౌండ్ నుంచే దూసుకుపోయారు. ఐదు, తొమ్మిది, పది, పదహారు రౌండ్‌లలో మాత్రం వెయ్యిలోపు ఆధిక్యత సాధించగా, నాలుగు, ఏడు, పదిహేను రౌండ్లలో వెయ్యికిపైగా ఆధిక్యతను సాధించారు. మిగతా అన్ని రౌండ్లలో రెండువేలకుపైగా ఆధిక్యతను సా ధించి తన విజయాన్ని ఖాయం చేసుకున్నారు. ప్రతి రౌం డ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యతనే సాధిస్తుండడంతో నన్నపునేని నరేందర్ గెలుపు నల్లేరుపై నడకగా మారింది. రౌండ్ రౌండ్‌కు టీఆర్‌ఎస్ మెజార్టీ పెరుగుతుండటంతో కాంగ్రెస్ ఏజెంట్లు మధ్యలోనే వెళ్లి పోయారు.