తెలుగుదేశం పార్టీ నేతల భూ బరితెగింపు పతాక స్థాయికి చేరుతోంది.. తాజాగాతెలుగు తెమ్ముళ్లు శ్మశాన స్థలాన్ని సైతం కబ్జా చేసి ఆ స్థలంలో ఏకంగా ఇళ్లు నిర్మించేసుకున్నారు.. ఇంత జరిగినా రెవెన్యూ విభాగం పట్టనట్టుగా మిన్నకుండిపోయింది. తిరుపతిలో లీలామహల్ నుంచి కరకంబాడి వెళ్లే విశాలమైన రోడ్డుపక్కనున్న స్ధలంలో శ్మశానం ఉండేది. ఇది తిరుపతి అర్బన్ రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడుపాళెం సర్వే నెం.199లో 1.45 ఎకరాల స్థ్థలం, 40 సెంట్ల కాలువ, 5 సెంట్లలో కమ్యూనిటీ హాల్ ఉంది. ఈ కమ్యూనిటీ హాలు మినహా మిగిలిన శ్మశాన స్థలం విలువ దాదాపు రూ.5 కోట్ల పైమాటే.
ఈ స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఏకంగా 28 కుటుంబాలు ఇళ్లను నిర్మించేసుకున్నాయి. ఇళ్లు నిర్మించుకుంటున్నా రెవెన్యూ శాఖ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తర్వాత ఇళ్లకు విద్యుత్, వాటర్ కనెక్షన్లు ఇచ్చేసారు. శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించిన అనంతరం నాయకులు కొత్త రాజకీయానికి తెరలేపారు. తమ ప్రాంతానికి శ్మశాన స్థలం కేటాయించాలని జన్మభూమిలో వినతి పత్రాలు అందజేస్తున్నారు. తిరుపతి శాసన సభ్యురాలు సుగుణమ్మ రెవెన్యూ అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు రెండో శ్మశాన వాటిక స్థలం కోసం రెవెన్యూ, అటవీశాఖ, నగరపాలక సంస్థ అధికారులు ఫైల్ సిద్ధం చేసేశారు. తమకేమీ తెలియనట్టు రెవెన్యూ శాఖ తెలివితేటలు ప్రదర్శిస్తోంది.
అటవీశాఖకు ప్రత్యామ్నాయంగా భూమి ఇప్పించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అటవీశాఖ అభ్యంతరం చెప్పకపోవడంతో రెండో శ్మశాన వాటికకు స్థలం కేటాయింపునకు ఆమోదముద్ర పడేలా పనిచేస్తున్నారు. వీలైనంత త్వరగా పనిపూర్తి చేయాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. సంస్థ కమిషనర్ ఈ ఫైల్ ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిసింది. ఉన్న శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకోవడమేమిటి గోవింద ధామం దగ్గరుండగా మరో శ్మశాన వాటికకు స్థలం కేటాయించే ప్రయత్నాలు జరగడమేమిటని ప్రశ్నించినా కనీసం ఎవ్వరూ కిమ్మనడం లేదు.