బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయంగా కక్ష కట్టి కొందరిని కిషన్ రెడ్డి చంపించారని ఆయన కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఢిల్లీ చేరారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు కిషన్ రెడ్డి మంగళవారం కేంద్ర హౌంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరినట్టు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలు తనపై బురద జల్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని… వారు ఆరోపిస్తున్నట్టు తాను ఎవ్వరినీ చంపలేదని తెలిపారు.
తాను 11 మందిని చంపానని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న దాంట్లో ఎంతమాత్రం వాస్తవం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సయ్యద్ షుజా, కపిల్ సిబల్ తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈవీఎం ట్యాంపరింగ్‌లతో 2014లో బీజేపీ గెలిచిందని చెప్పేందుకు కాంగ్రెస్ బుద్ధి లేదన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్‌పై కూడా ఎన్నికల సంఘం దర్యాప్తు చేయాలని కోరారు. సయ్యద్ షుజా పట్టుకొని గట్టిగా శిక్షించాలన్నారు. ఆయన వ్యాఖ్యలతో తనకు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. తన పరువుకు భంగం కలిగించినట్టు చెప్పారు. ఈ విషయంపై వారిపై తాను పరువు నష్టం దావా వేయనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనపై రాఫెల్ తరహాలో తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు.