ఒక్కసారి కాదు.. ఐదు సార్లు .. ఒకసారి తప్పించి మరోకసారి కాదు.. ఐదు సార్లు వరుసగా ఒకే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అది రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో… అప్పటి ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుండి 1983,1985,1989,1999,2004లో ఎమ్మెల్యేగా గెలుపొందిన గుమ్మడి నర్సయ్య గురించే ఈ ఉపోద్ఘాతం.
ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు పది తరాలు కూర్చుని తినేంతగా కోట్లు సంపాదించేవాళ్లున్న ప్రస్తుత రోజుల్లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కానీ కనీసం కోటి కూడా వెనకేయని గుమ్మడి నర్సయ్య నిన్న మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు విచ్చేశారు. అది మధ్యాహ్నాం అయింది. ఆకలేసింది. అదే వేరే మాజీ ఎమ్మెల్యే కావచ్చు మాజీ మంత్రి కావచ్చు..
ఫైవ్ స్టార్ హోటల్ కెళ్లి ఖర్చు చేసి మరి తింటారు. అయితే ఏదో పనిమీద మంగళవారం హైదరాబాద్ వచ్చిన నర్సయ్య నగరంలోని బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనం తింటూ కన్పించారు.ఇన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కానీ ఆయన ఏనాడూ సింప్లిసిటీ మరువలేదు. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ తరం పరేషాన్ అవుతుంది. పదవిలో ఉన్నంతకాలం గుమ్మడి నర్సయ్య బస్సు, రైల్ లో హైదరాబాద్ వచ్చేవారు. ఆటోలో అసెంబ్లీకి వెళ్లేవారు. విద్యానగర్ లోని పార్టీ ఆఫీస్ లో ఉండేవారు. ఎమ్మెల్యేగా వచ్చిన జీతం మొత్తం సీపీఐ ఎంఎల్- న్యూ డెమోక్రసీ పార్టీకే విరాళంగా ఇచ్చేవారు. ఆయనకు కొంత పొలం తప్ప.. వేరే ఆస్తులే లేవు. నర్సయ్య గ్రేట్ లీడర్