Home / ANDHRAPRADESH / పోలవరం పూర్తి చేయటానికి జగన్ తీసుకున్న కార్యాచరణ భేష్..!

పోలవరం పూర్తి చేయటానికి జగన్ తీసుకున్న కార్యాచరణ భేష్..!

పోల‌వ‌రం ప్రాజ‌క్టు ప‌నుల డిజైన్లకు కేంద్రంనుండి అనుమ‌తుల మంజూరులో జాప్యం కాకుండా వుండేందుకు ఢిల్లీలో ఒక అధికారిని నియ‌మించాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా ప్రాజ‌క్టు ప‌నుల డ్రాయింగ్‌లు, డిజైన్ల అనుమ‌తి, లైజ‌నింగ్ కోసం పూర్తి స్థాయిలో ఒక అధికారిని నియ‌మించాల‌న్నారు.
ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం ఉద‌యం పోల‌వ‌రం ప్రాజ‌క్టు ప్రాంతానికి హెలికాప్ట‌ర్‌లో చేరుకున్నారు. తొలుత ఏరియ‌ల్ స‌ర్వే చేసిన ముఖ్య‌మంత్రి అనంత‌రం ప్రాజ‌క్టు ప్రాంతానికి వెళ్ళారు. అక్క‌డ ప్రాజ‌క్టు క్రెస్ట్ గేట్లు, స్పిల్ ఛాన‌ల్‌, స్పిల్‌వే ప‌నుల‌ను చూసారు. అక్క‌డ నుండి కాఫ‌ర్ డామ్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న త‌ర్వాత కొండ‌పై వున్న పోల‌వ‌రం ప్రాజ‌క్టు కాంట్రాక్ట్ ఏజెన్సీ కార్యాల‌యానికి చేరుకున్నారు. అక్క‌డ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిష‌న్‌ను తిల‌కించారు. ఇంజ‌నీరింగ్ ఉన్న‌తాధికారులు ముఖ్య‌మంత్రికి ప్రాజ‌క్టు మ్యాప్ ద్వారా ప‌నుల వివ‌రాల‌ను తెలిపారు. హిల్‌వ్యూ నుండి ముఖ్యంమంత్రి ప్రాజ‌క్టు ప‌రిస‌రాల‌ను తిల‌కించారు. కార్యాల‌య మీటింగ్ హాల్‌లో అదికారుల‌తో ఆయ‌న ప్రాజ‌క్టు ప‌నుల పురోగ‌తి స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రాజ‌క్టు పనుల డిజైన్లు అనుమతుల్లో ఆలస్యం కాకుండా ఉండాలంటే.. దీనిపై ప్రత్యేకమైన దృష్టిపెట్టాల్సివుంద‌న్నారు. దీని కోసం ఢిల్లీలో అధికారిని నియ‌మించ‌డంతో పాటు లైజాన్ ఆఫీస‌ర్‌ను కూడా పూర్తి స్థాయిలో నియ‌మించాల‌న్నారు. ఢిల్లీలో అదికారి ప‌నుల డిజైన్ల అనుమ‌తి స‌త్వ‌రం తెచ్చే విధంగా విధులు నిర్వ‌హించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప్రాజ‌క్టు నిర్మాణం త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేందుకు అధికారులు ఇంజ‌నీర్ల‌తో కార్యాచ‌రణ ప్ర‌ణాళికపై చ‌ర్చించారు. 2021 జూన్‌నాటికి ప్రాజెక్టును పూర్తి కావాల‌ని ఆయ‌న ఆదేశించారు. ఆమేర‌కు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. 2021 సీజన్‌కు ప్రాజ‌క్టు అందుబాటులోకి తీసుకు వస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంద‌ని అభిప్రాయ‌ ప‌డ్డారు. దీనివల్ల నీటిని అందించడానికి వీలుంటుంద‌న్నారు. గతంలో ప్రణాళిక, సమన్వయం, సమాచార లోపాలు చోటు చేసుకున్నాయ‌న్నారు. దీనివల్ల గత సీజన్‌ను కోల్పోయామ‌ని, ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కూడా పనులు జరగాల‌ని ఇవి జరగడానికి ఉన్న అడ్డంకులపై దృష్టిపెట్టి వాటిని తొల‌గించుకోవాల్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ స్పిల్‌వే పనులు జూన్‌ కల్లా పూర్తికావాల‌ని, అదేవేగంతో అప్రోచ్‌ ఛానల్‌కూడా పూర్తికావాల‌ని ఆదేశించారు. స్పిల్‌వేను జూన్‌నాటికి అందుబాటులోకి తీసుకు వస్తే నదిలో నీటిని స్పిల్‌వేమీదుగా తరలించే అవకాశం ఉంటుంద‌న్నారు. అదే సమయంలో జూన్, నుండి, అక్టోబరువ‌ర‌కు ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం పనులు జరగాలంటే కాపర్‌ డ్యాంలో ఇప్పుడున్న ఖాళీలను కూడా భర్తీచేయాల్సి ఉంటుంద‌న్నారు. ఈ పనులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాల్సి ఉంటుంద‌న్నారు. మరోవైపు కాపర్‌ డ్యాం పూర్తిచేసేసరికి ముంపు పెరుగుతుంద‌ని ముంపు ప్రాంతాలనుంచి ప్రజలను తరలించాల్సి ఉంటుంద‌ని ఆయ‌నన్నారు. ఈ పనులు ఆరోజు నుంచి ప్రారంభిస్తే ఉపయోగం ఉండదని, సహాయ పునరావాస పనులపై ఇప్పటినుంచే దృష్టిపెట్టి ఆ పనులను ప్రారంభించాల‌ని ఆదేశించారు. స్పిల్‌వే ఛానల్‌లో మొన్నటి వరదకారణంగా బాగా సిల్ట్‌ పేరుకు పోయింద‌ని, దీనివల్ల ఎక్కడ కాంక్రీట్‌ చేశారు, ఎక్కడ చేయలేదన్నది గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంద‌న్నారు. తర్వాత కాలంలో ఈ సిల్ట్‌ మరింతంగా పెరిగే అవ‌కాశం వున్నందున క్షుణ్ణంగా ప‌రిశీల‌న చేసి ఎక్కడ కాంక్రీట్‌ చేశారు, ఎక్కడ చేయలేదన్నదీ ఇప్పుడే గుర్తించాల‌న్నారు. పనులు వేగంగా జరగడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. గతంలో అప్రోచ్‌ ఛానల్‌ కూడా చేయకపోవడంవల్ల ఈ సిల్ట్‌ వచ్చి పేరుకుపోయింద‌న్నారు. కుడి, ఎడమ కాల్వలను అనుకున్న లక్ష్యంలోగా వినియోగంలోకి తీసుకు రావడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా ట్విన్ ట‌న్నెల్ తవ్వ‌కం ప‌నుల ప్ర‌గ‌తిని ఆయ‌న అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

జూన్‌కల్లా కుడి ప్ర‌ధాన కాల్వ‌ కనెక్టివిటీ పూర్తవుతుందని అధికారులు ముఖ్య‌మంత్రికి చెప్పారు. ఈ కాల్వ‌ టన్నెల్‌లో లైనింగ్‌ కూడా పూర్తువుతుంద‌ని వివ‌రించారు. దీనిపై స్పందించిన ముఖ్య‌మంత్రి జూన్‌కల్లా తప్పకుండా నీరు పోయేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎడమకాల్వ కనెక్టివిటీకి సంబంధించి రెండు ప్యాకేజీల్లో పనులు నడుస్తున్నాయని అధికారులు చెప్పారు. టన్నెల్‌తోపాటు ఎడమ కాల్వపనులు కూడా వేగవంతంగా అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. మళ్లీ నీరు వచ్చి గండ్లు పడే పరిస్థితులు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం పనులు ముందుకు సాగాలంటే మనకున్న సమస్యలు, అడ్డంకులు ఏంటి? అన్నవాటిని గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. జూన్‌ నుంచి అక్టోబరు వరకూ పనులు ఆగిపోకుండా ఉండాలంటే.. ఏయే పనులు కావాలి, వాటికి సంబంధించిన ఏం అనుమతులు కావాలి, ప్రాధాన్యతా క్రమంలో ఏం చేయాలన్నదానిపై ఒక జాబితా రూపొందించుకుని ఫోకస్‌గా ముందుకుపోవాలని ఆయ‌న చెప్పారు. స్పిల్‌వే ముందరి భాగంలో నిర్మించాల్సిన బ్రిడ్జిపైకూడా చ‌ర్చించారు. ఈ బ్రిడ్జిని ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాంతో అనుసంధానించేలా డిజైన్ చేస్తే తద్వారా నాలుగు వరుసల రహదారి ఏర్పడుతుందని అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. డిజైన్‌ ఖరారు చేసి ఆమేరకు పనుల విషయంలో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు.

ఈ వంతెన‌కు వైయస్సార్‌ గేట్‌ వేగా పేరుపెట్టాలని ప్ర‌తిపాదించారు. కాపర్‌ డ్యాంలో ఇప్పుడున్న ఖాళీలను పూర్తిచేస్తే గోదావరిలో 41.15 మీటర్ల మేర నీరు నిల్వ ఉంటుందని అధికారులు వివ‌రించారు. దీనివల్ల వెంటనే 17వేలకు పైగా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని వారు చెప్పారు. ఆమేరకు సహాయ పునరావాసాల పనులపై ముందుకు వెళ్లాల‌ని ముఖ్య‌మంత్రి వారికి సూచించారు. ప్రాధాన్యతా క్రమంలో తరలించాల్సిన వారి వివరాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల కోసం ఒక ప్రత్యేక అధికారిని నియ‌మించామ‌ని ఆయ‌న చెప్పారు. నిర్వాసితుల నుండి ఫిర్యాదులు లేకుండా మాన‌వ‌తా దృక్ప‌థంతో ఉండాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఒక రూపాయి ఎక్కువ పెట్టినా పర్వాలేదని, ముంపు బాధితుల పట్ల మానవతా దృక్పథంతో ఉండాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి అవసరమైన డబ్బును అందుబాటులో ఉంచుతామని ఆయ‌న హామీ ఇచ్చారు. ముంపు సమ‌స్యను ప్ర‌స్తావిస్తూ ప్రాజ‌క్టు 35వ కాంటూరులో కూడా 6గ్రామాలు ముంపునకు గురవుతున్నాయ‌ని ముఖ్య‌మంత్రి దృష్టికి అధికారులు తీసుకు వ‌చ్చారు. ఈ 6 గ్రామాలను తరలించాల్సి ఉంటుందని వివ‌రించారు. దేవీపట్నం మండలంలో 6 గ్రామాలను తక్షణం తరలించాల్సి ఉంటుందని తెలిపారు. గ‌తంలో భధ్రాచలంలో మూడోవిడత ప్రమాద హెచ్చ‌రిక జారీ చేస్తే ఈ గ్రామాలు మునిగేవ‌ని అయితే ఇప్పుడు మొదటి ప్రమాదహెచ్చరిక వస్తేనే మునిగిపోతున్నాయని అధికారులు చెప్పారు. దీనికి స్పందించిన ముఖ్య‌మంత్రి మొద‌టి ప్ర‌మాద హెచ్చరిక వ‌చ్చేనాటికే స‌హాయ పున‌రావాస కార్య‌క్ర‌మాల‌కు అదికారులు సిద్ధం కావాల‌ని ఆదేశించారు. పునరావాలస కాలనీల్లో పనులకు అవసరమైన డబ్బు విడుదలచేస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. స‌మీక్షా స‌మావేశంలో డిప్యూటీ ముఖ్య‌మంత్రులు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌, ఇరిగేష‌న్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌, మంత్రులు చెరుకువాడ శ్రీ‌రంగ‌నాథ‌రాజు, పేర్ని నాని, తానేటి వ‌నిత‌, లోక్‌స‌భ సభ్యులు కోట‌గిరి శ్రీ‌ధ‌ర్, ఎమ్మెల్యేలు తెల్లం బాల‌రాజు, ముదునూరి ప్ర‌సాద‌రాజు, కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌ తడితరులు పాల్గొన్నారు.