Home / EDITORIAL / చైనా వస్తువులను నిషేధాలు సాధ్యమా?

చైనా వస్తువులను నిషేధాలు సాధ్యమా?

గల్వన్‌ లోయలో జరిగినదానికి ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, ఆవేశపడడం, దేశభక్తితో ఉర్రూతలూగిపోవడం సహజమే కావచ్చు. ఆ మనోభావాలను అర్థం చేసుకోవచ్చును. కానీ, జనావేశాలను ఆధారం చేసుకుని యుద్ధాలు చేయడం కానీ, నిషేధాలు ఆంక్షలు విధించడం కానీ జరగవని ప్రజలకు అర్థంకావడానికి సమయం పడుతుంది. బహుశా ప్రభుత్వాలు కూడా, జనం ఆక్రోశం చల్లారనీ అన్నట్టుగా, ఆవేశకావేశాలను కొంత కాలం అనుమతిస్తాయి. ఫలితంగా, ప్రత్యేకంగా ఒక దేశంమీద, అక్కడి ప్రజలమీద, దానికి సంబంధించిన అన్ని విషయాల మీద వ్యక్తమవుతున్న వ్యతిరేకత, క్రమంగా జనం మనసుల్లో ఆలోచనల్లో మరింతగా స్థిరపడిపోతుంది.

దేశవ్యాప్తంగా, చైనా నాయకుల ఫోటోలను, జెండాలను, కొన్నిచోట్ల చైనా తయారీ వస్తువులను తగులబెట్టి నిరసనలు చెబుతున్నారు. చైనా వస్తువులను నిషేధించి ఆ దేశాన్ని ఎట్లా దివాలా తీయించాలో నాయకులు, టీవీ ప్రసంగాల్లో నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనవసరం లేదు. ఆయుధాలు పట్టుకుని సరిహద్దుల్లోకి వెళ్లడానికి తయారు అన్నట్టుగా తమ దేశభక్తి తీవ్రతను ప్రకటిస్తున్నారు. దేశం శ్రేయస్సు మీద ఇంతటి భావావేశం ఉండడం మంచిదే. అదేమి దురదృష్టమో కానీ, దేశానికి పొరుగుల నుంచి ముప్పు రావడం వంటి ప్రతికూల సందర్భాలలో కానీ, శత్రుదేశాల మీద మనం విజయం సాధించిన వేళల్లో కానీ, క్రికెట్ క్రీడలు జరుగుతున్నప్పుడు కానీ, మాత్రమే ఈ దేశభక్తి ప్రజలలో పెల్లుబుకుతుంది. స్పర్థ, యుద్ధం, బలప్రదర్శన- వంటి సమయాల్లో కాక, అభివృద్ధి, సహకారం, సహజీవనం వంటి సానుకూల అంశాల విషయంలో కూడా ప్రజలు దేశభక్తితో స్పందిస్తే బాగుండును కదా అనిపిస్తుంది.

ఆవేశాలు, ఆకాంక్షలు సరే కానీ, నిజంగా మనం చైనా వస్తువులన్నిటిని నిషేధించగలమా? ఆ దేశపు ఉత్పత్తులు లేకుండా మన దైనందిన జీవితం కానీ, ఆర్థిక జీవితం కానీ సజావుగా సాగుతాయా? ఇటువంటి మౌలిక ప్రశ్నలను కూడా చర్చించకపోతే, మన కోపతాపాలు మాటలకే పరిమితం అయినవి అవుతాయి. సంఘటన జరిగిన మరునాడు, భారత విదేశాంగ మంత్రి చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడారు, జరిగినదాని విషయమై తీవ్రమైన నిరసనను వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక స్థాయి నుంచి, అంతర్జాతీయస్థాయికి మన ఫిర్యాదు వెడుతుందా, వెడితే ఏ వేదికకు వెడుతుంది, వేచి చూడాలి. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో చైనా వస్తువులను, కాంట్రాక్టులను విరమించుకొమ్మని కేంద్రం ఆదేశించినట్టు చెబుతున్నారు కానీ, అది అధికారికంగా వెలువడిన నిర్ణయమో కాదో తెలియదు. ఈ సందర్భంగా, విషయాలు తెలిసినవారు కూడా అమాయకత్వం నటించడం పొరపాటు. ఇప్పటికే కుదిరిన కాంట్రాక్టులను రద్దుచేసుకోవడం కానీ, ఫలానా దేశం సామగ్రిని కొనగూడదని నిర్ణయాలు తీసుకోవడం కానీ అంత సులువు కాదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలు, అంతర్జాతీయ ప్రమాణాలు చాలా ఉంటాయి. ఇరాక్, చైనా వంటి దేశాలను ఆర్థిక దిగ్బంధం చేయడానికి ఐక్యరాజ్యసమితి, భద్రతాసంఘం ద్వారా అమెరికా ఎంతటి ప్రయత్నాలు చేసిందో తెలిసిందే. ఎటువంటి అంతర్జాతీయ సమ్మతి లేకున్నా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే సత్తా అమెరికాకు ఉన్నది. అంతటి అమెరికాకు కూడా చైనా విషయంలో వాణిజ్య, ఆర్థిక నిర్బంధాలు పెట్టడం గగనం అవుతున్నది. ఎందుకంటే, చైనాలో అమెరికా ఎంత ఉన్నదో, అమెరికాలో చైనా అంత వేళ్లు పాదుకుని ఉన్నది. చైనా వస్తువులన్నిటి దిగుమతులు భారత్ నిలిపివేస్తే, చైనాకు ఆర్థిక నష్టం జరిగేమాట నిజమే కానీ, మనకు జరిగేనష్టం చిన్నదేమీ కాదు. ప్రాణావసరమైన ఔషధాల దగ్గర నుంచి, అనేక ఎలక్ట్రానిక్ పరికరాల దాకా చైనానుంచే రావాలి. ఎవరో మేధావి ఒక టెలివిజన్ చర్చలో చెబుతున్నారు, చైనా నుంచి జరిగే దిగుమతుల్లో మన ఆర్థిక వ్యవస్థకు కీలకమైనవి ఉన్నాయి కాబట్టి, దశల వారీగా నిషేధం విధించాలట. మనకు పెద్దగా అవసరం లేనివి ముందుగా నిషేధించి, నెమ్మదిగా ప్రత్యామ్నాయం వెదుక్కుని తక్కినవి కూడా నిషేధించాలట. మన అభీష్టం ప్రకారం వ్యవహరించడానికి చైనా తెలివితక్కువదేమీ కాదు కదా? బల్క్ డ్రగ్స్ ఎగుమతులను అది నిలిపివేస్తే?

చైనా నుంచి చేసుకునే దిగుమతులన్నీ కలిపి, భారత్ మొత్తం దిగుమతుల్లో 13 శాతం దాకా ఉన్నాయి. భారత్ చేసే ఎగుమతుల్లో కేవలం 3 శాతం మాత్రమే చైనాకు జరుగుతున్నాయి. ఎగుమతుల- – దిగుమతుల తేడాయే చాలు ఉభయుల ఆర్థిక వ్యవస్థల స్థితిగతుల గురించి చెప్పటానికి. కొవిడ్-19 కారణంగా, ప్రపంచంలోని అనేక ఉత్పాదక పరిశ్రమలు ఇంకా లాక్‌డౌన్‌లో కునారిల్లుతుండగా, చైనాలో పరిశ్రమలు కోలుకుని ఉత్పత్తులు ప్రారంభించాయి. కరోనా అనంతర స్థితిలో కూడా చైనా ముందంజలోనే ఉన్నది. ఈ స్థితిలో తీవ్రమైన చర్యల ఔచిత్యం గురించి ఆలోచించవలసి ఉన్నది. ఈ దేశంలో 3 వేల మంది మరణానికి కారణమై, వేలాదిమందిని తరతరాల పాటు అనారోగ్యం పాలుచేసిన అమెరికన్ కంపెనీ యూనియన్ కార్బైడ్, నామమాత్రపు పరిహారం మాత్రమే చెల్లించి ఇంకా మనదేశంలో నడుస్తూనే ఉన్నది. ఎవరెడీ బ్యాటరీతో సహా కార్బైడ్ వస్తువులను ఎవరూ బహిష్కరించలేదు. జాతీయోద్యమ కాలంలో, విదేశీవస్తువులు తక్కువ ఉండడం, ప్రధానంగా జౌళి పరిశ్రమ చేనేతను దెబ్బతీయడం కారణంగా స్వదేశీ ఉద్యమం విజయవంతంగా సాగింది. జాతీయ అధికారపార్టీకి భావసహోదర సంస్థ అయిన స్వదేశీ జాగరణ్ మంచ్ ‍‍సైతం జాబితాలు తయారుచేయడం తప్ప మరే నిషేధానికీ ఉద్యమించలేకపోయింది. నిజానికి, విదేశీ వస్తువులను నిరాకరించడం అంటూ చేయాలనుకుంటే, దాన్ని సైనిక ప్రత్యర్థి దేశాలకు మాత్రమే పరిమితం చేయడం ఎందుకు? మన దేశంలో ఉత్పత్తి సాధ్యమయ్యే ప్రతి వస్తువుకీ మనదేశ మార్కెట్లో రక్షణలు కల్పించాలి. వ్యవసాయంలో దొడ్డిదారిన, రక్షణ రంగంలో బాహాటంగా విదేశీపెట్టుబడులకు తలుపులు తెరుస్తున్నప్పుడు, స్వదేశీ అన్నది ఒక జాతీయవిలువగా ఎక్కడున్నది? ప్రపంచీకరణ కాలంలో, అంతర్జాతీయ ఒప్పందాలకు దాసోహం అన్న తరుణంలో స్వీయ పరిరక్షణ చర్యలకు చెల్లుబాటెక్కడ?

సాధ్యాసాధ్యాలు, ఉచితానుచితాలు జాగ్రత్తగా వివేచన చేసుకుని, ఏ రంగంలో శత్రువుని ఇబ్బంది పెట్టవచ్చునో గుర్తించి, అందుకు అనుగుణంగా ప్రయత్నించాలి