దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రీన్ బడ్జెట్
సీఎం దార్శనికతవల్లే ఉద్యమంలా హరితహారం
రాష్ట్రంలో 29 శాతానికి పెరిగిన అటవీ విస్తీర్ణం
అసెంబ్లీలో ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి హరితప్రేమికులు ప్రపంచంలోనే లేరని, దేశంలో ఎక్కడా లేనివిధంగా బడ్జెట్‌లో 10 శాతాన్ని పచ్చదనం పెంపుకోసం కేటాయించడమే ఇందుకు నిదర్శనమని ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అర్బన్ పార్కులు, లంగ్‌స్పేస్‌ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నదని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో అర్బన్ పార్కులు, లంగ్‌స్పేస్ పనులపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. భవిష్యత్ తరాలకు ఆహ్లాదకర, మానసికోల్లాసం కలిగించే వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతోనే హరితహారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. దేశంలోనే తొలిసారిగా 10% గ్రీన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. ఆ నిధులతో గ్రీన్ యాక్షన్ ప్లాన్ రూపొందించి, ఏటా వర్షాలు ప్రారంభంకాగానే తెలంగాణకు హరితహారం పేరుతో ఉద్యమంలా మొక్కలునాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. నాటిన మొక్కల్లో 85% బతికేలా కఠిన చర్యలుచేపట్టామని, ఇందుకోసం మున్సిపల్ చట్టమే తీసుకొచ్చామని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24% నుంచి 29 శాతానికి పెరిగిందన్నారు.