అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దంపతులు శుక్రవారం బహిరంగంగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటారని వైట్‌హౌస్ ప్రకటించింది. కొవిడ్ టీకాపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు టీకా తీసుకుంటున్నారని పేర్కొంది.
‘అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కరెన్ పెన్స్ టీకా భద్రత, సామర్ధ్యాన్ని ప్రోత్సహించడానికి, అమెరికన్ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి కొవిడ్-19 వ్యాక్సిన్ ను బహిరంగంగా తీసుకుంటారు’ అని వైట్‌హౌస్ తెలిపింది.
కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న అమెరికాలో ఇటీవల కొవిడ్ టీకా పంపిణీ ప్రారంభమైంది. ఫైజర్ వ్యాక్సిన్ తొలి డోసును క్వీన్స్‌లోని లాంగ్ ఐలాండ్ యూదు మెడికల్ సెంటర్‌లో క్రిటికల్ కేర్‌లో పని చేస్తున్న సాండ్రా లిండ్సేకు ఇచ్చారు. ఈ క్రమంలో కొవిడ్ టీకాపై ప్రజల్లో ఉన్న అనుమానాలను, భయాలను తొలగించేందుకు ఇప్పటికే తాము కూడా బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకుంటామని అమెరికా మాజీ అధ్యక్షులు సైతం ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అమెరికాలో 17 మిలియన్లకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మూడు లక్షలకుపైగా జనం మృత్యువాతపడ్డారు.