Home / HYDERBAAD / హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్‌-అమెరికా తర్వాత అతి పెద్ద ఆఫీస్‌

హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్‌-అమెరికా తర్వాత అతి పెద్ద ఆఫీస్‌

హైదరాబాద్‌లో మరో బహుళజాతి కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మెడ్‌ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (ఎంఈఐసీ)ను బుధవారం నానక్‌రామ్‌గూడలో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. అమెరికాకు బయట మెడ్‌ట్రానిక్‌ సంస్థ ఏర్పాటుచేసిన అతి పెద్ద ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఇదే కావటం విశేషం.

హైదరాబాద్‌ సెంటర్‌లో 160 మిలియన్‌ డాలర్ల (రూ.1200 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. రానున్న ఐదేండ్లలో దాదాపు వెయ్యిమందికి ఈ సెంటర్‌లో ఉపాధి అవకాశాలు లభిస్తాయ ని పేర్కొన్నది. దాదాపు 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడ్‌ట్రానిక్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ దేశానికే మెడికల్‌ డివైజ్‌ హబ్‌గా హైదరాబాద్‌ మారబోతున్నదన్నారు. గూగు ల్‌, యాపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, సేల్స్‌ఫోర్‌, నోవార్టీస్‌, ఉబెర్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు అమెరికాకు బయట తమ రెండో అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేశాయని గుర్తుచేశారు. తాజాగా ఆ జాబితాలో మెడ్‌ట్రానిక్‌ కూడా చేరటంపై సం తోషం వెలిబుచ్చారు.