హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బానిస అంటూ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బీసీ కులాలు మండిపడ్డాయి. బీసీ సమాజానికి ముఖ్యంగా యాదవులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
ఈటల గ్రామాల్లోకి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించాయి. గురువారం యాదవులు వరంగల్‌అర్బన్ జిల్లా కమలాపూర్ బస్టాండ్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్నెబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. యాదవ కులానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఈటల జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు.
యాదవులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా, ఇల్లందకుంటలో గొల్ల, కుర్మల సంఘాల నేతలు ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు.